నాలుగు వేలు యాడ ఆదుకుంటాయి..

నాలుగు వేలు యాడ ఆదుకుంటాయి..

వేలల్లో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఇచ్చే రూ.4 వేలు యాడ ఆదుకుంటాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన తొలిసారిగా గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా నాగం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌వి ఆపదమొక్కులు.. అమలుకానీ హామీలని కేసీఆర్‌ అంటున్నారని.. కానీ రైతులను మోసం చేసిన మొదటి వ్యక్తి కేసీఆరేనని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దశలవారీగా చేసిన రుణమాఫీ రైతులను ఏ మాత్రం ఆదుకోలేదన్నారు.

పత్తి వేసుకోవద్దు.. మొక్కజోన్న వేసుకోవాలని ఊరువాడా ప్రచారం చేశారని.. మిమ్మల్ని నమ్మి రైతులు మొక్కజోన్న వేసుకున్నారని.. కానీ మొక్కజోన్న పంటలు ఎండిపోతే కరువు మండలాలు ప్రకటించలేదన్నారు. అందుకే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే వాళ్లను సంక్షోభం నుంచి బయటపడేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని.. కాంగ్రెస్ రుణమాఫీపై ప్రజలకు విశ్వాసముందని.. అవినీతిని రూపుమాపుతామని.. రెండు లక్షల రుణమాఫీ ఒక్కదఫాలోనే చేసి చూపిస్తామని నాగం తెలిపారు. టీఆర్ఎస్, కేసీఆర్ అవినీతిని బయటపెట్టేందుకు కాంగ్రెస్‌లో చేరానని.. అంతేకానీ టికెట్ కోసం.. సీట్ల కోసం కాదని వెల్లడించారు. పార్టీలో అందరితో కలిసి పనిచేస్తానని.. తనకు ఎవ్వరితో విభేదాలు లేవని.. నాకున్న ఏకైక శత్రువు టీఆర్ఎస్ పార్టీనే అని నాగం జనార్థన్ రెడ్డి వివరించారు.