రివ్యూ: నా పేరు సూర్య 

రివ్యూ: నా పేరు సూర్య 

నటీనటులు: అల్లు అర్జున్, అను ఎమ్మాన్యూయల్, శరత్ కుమార్, అర్జున్ తదితరులు 

సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి 

సంగీతం: విశాల్-శేఖర్ 

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు 

నిర్మాతలు: శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసు, నాగేంద్రబాబు 

దర్శకుడు: వక్కంతం వంశీ

తన నటన, డాన్సులతో వెండితెరపై సందడి చేసే అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'నా పేరు సూర్య 

నా ఇల్లు ఇండియా'. రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథలోకి వెళ్తే.. సూర్య(అల్లు అర్జున్) తన కోపంతో చిన్నప్పుడే తల్లితండ్రులకు దూరమవుతాడు. మిలిటరీలో ఓ సైనికుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. తనకున్న కోపం కారణంగా సూర్య అధికారులకు, మిలిటరీ నియమనిబంధనలకు వ్యతిరేకంగా కస్టడీలో ఉన్న ఓ టెర్రరిస్ట్ ను చంపేస్తాడు. దీంతో కల్నల్(బొమన్ ఇరానీ) సూర్యను మిలిటరీ నుండి బహిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. వృత్తిని ప్రాణంగా ప్రేమించే సూర్య దానికి అంగీకరించలేదు. తన గాడ్ ఫాదర్(రావు రమేష్) సహాయంతో కల్నల్ ను కన్విన్స్ చేసి ఒప్పిస్తాడు. సూర్యను బోర్డర్ కు పంపాలంటే ఫేమస్ సైకియాట్రిస్ట్ రామకృష్ణంరాజు(అర్జున్) దగ్గర నుండి ఓ సంతకం తీసుకురావాలని చెబుతాడు కల్నల్. రామకృష్ణంరాజు మరెవరో కాదు సూర్య కన్నతండ్రి. మరి సూర్య తన తండ్రి దగ్గర నుండి సంతకం పొందగలిగాడా..? తిరిగి మిలిటరీలో జాయిన్ అయ్యాడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

కళాకారుల పనితీరు: 

ఈ సినిమా ప్రధాన ఆకర్షణ అల్లు అర్జున్ నటన. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సైనికుడి పాత్రలో ఇమిడిపోయాడు. నిజమైన సూర్య ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా నటించాడు. సీరియస్ లుక్ తో ప్రతి ఒక్కరిని మెప్పిస్తాడు. ఇక ఫైట్స్ , డాన్స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటిలానే తన సత్తా చాటాడు. అను ఎమ్మాన్యూయల్ గ్లామర్ షోకి పరిమితమైంది. ఆమె సన్నివేశాలు కూడా ఏదో కావాలని అతికించినట్లుగా అనిపిస్తుంది. ప్రోపర్ లవ్ ట్రాక్ లేకపోవడం మైనస్. తెరపై వీరిద్దరి రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం బాగా పండాయి. విలన్ పాత్రలో శరత్ కుమార్ కు సరైన క్యారెక్టరైజేషన్ రాసుకోలేకపోయారు. అర్జున్ తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. సినిమా మరో ప్లస్ పాయింట్ సాయి కుమార్ నటన. సెకండ్ హాఫ్ లో వచ్చే సాయి కుమార్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా మారింది. బొమన్ ఇరానీ, రావు రమేష్, నదియా వంటి సీనియర్ తారలను రెండు, మూడు సన్నివేశాలకే పరిమితం చేశారు. 

సాంకేతికవర్గం పనితీరు: 

రచయితగా ఎన్నో చిత్రాలకు మంచి కథలను అందించిన వక్కంతం వంశీ మొదటిసారి డైరెక్ట్ చేస్తున్నాడంటే ఎంత బలమైన కథను రాసుకొని ఉంటాడో అని అంతా అనుకున్నారు. బహుశా అతడు అనుకున్న పాయింట్ ను తెరపై సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడో.. ఏమో.. కానీ సినిమా మాత్రం చాలా పేలవంగా తయారైంది. అసలు కొన్ని సీన్స్ ఎందుకు వస్తున్నాయో..? ఎందుకు వెళ్తున్నాయో..? అర్ధం కానీ పరిస్థితి. హీరో పాత్రను ఎలివేట్చేయడంపై పెట్టిన దృష్టి కథ, కథనాలపై పెట్టి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విశాల్-శేఖర్ అందించిన సంగీతం సినిమా ప్లస్ అయింది. హీరోకి కోపం 

వచ్చేప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే స్కోర్ మరో హైలైట్. ఎడిటింగ్ వర్క్ పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

విశ్లేషణ: 

కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఓ యువకుడు తన దేశం కోసం తన క్యారెక్టర్ ను మార్చుకోవడానికి 

సిద్ధమవుతాడు. ఈ క్రమంలో అతడిలో ఎలాంటి రియలైజేషన్ వచ్చిందదనే పాయింట్ తో ఈ సినిమాను రూపొందించారు. సినిమా మొత్తం యాక్షన్ తో నిండిపోయుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సాఫీగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ నుండి సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ నుండి సినిమా సిటీకు షిఫ్ట్ అయిన తరువాత రొటీన్ గా సాగుతుంది. ఇక ఫ్యామిలీ నేపధ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఎమోషన్ కనిపించదు. పతాక సన్నివేశాలు మరింత పేలవంగా అనిపిస్తాయి. అల్లు అర్జున్ నటన, భారీతనం, యాక్షన్ వంటి అంశాలు మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. బి,సి సెంటర్స్ లో సినిమాకు మంచి వసూళ్లు రావడం ఖాయం.  

ఫైనల్ గా చెప్పాలంటే.. అల్లు అర్జున్ లేట్ రియలైజేషన్