ముద్రగడ కాదంటే భుజం కాసేది ఎవరు?

ముద్రగడ కాదంటే భుజం కాసేది ఎవరు?

రిజర్వేషన్ల సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమం నడిపించారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆ వేడి చల్లారిపోయింది. మళ్లీ భుజం కాస్తారా లేదా అని అనుకుంటున్న సమయంలో కాడి పడేసి సంచలనం రేపారు. ఇది ఎత్తుగడా లేక.. ఉద్యమం రంగు మారుతోందా? ఆ సామాజికవర్గంతోపాటు  తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?  

ముద్రగడది వ్యూహమా.. సరికొత్త ఎత్తుగడా?

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఏమైంది? ఎందుకు కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పుకొన్నారు? ఆయన్ని ఎవరేమన్నారు? పోలీసు కేసులను ఎదుర్కొన్న ఆయన... ఎవరో అన్న మాటలకు మనస్తాపం చెందడం నిజమేనా? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చకు దారితీస్తున్న ప్రశ్నలివే. ఇది వ్యూహమా.. సరికొత్త ఎత్తుగడ అన్న దిశగా కూడా కొందరు ఆరా తీస్తున్నారు. 

పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలతో మళ్లీ రిజర్వేషన్లపై చర్చ!
 
కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఒకానొక సమయంలో చంద్రబాబుకు కంటిపై కనుకు లేకుండా చేశారు. టీడీపీకి చీకటి రోజులు రావాలని అప్పటి వరకూ ఏ పండగా జరపుకోనని శపథం చేశారు. తర్వాత ఎన్నికలు రావడం.. రాష్ట్రంలో టీడీపీ ఓడి.. వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. తాజాగా కాపుల రిజర్వేషన్ల సంగతేంటి అని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో కొద్దిరోజులుగా ఈ అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ విడుదల చేశారు. అడిగినవి అడగనవి అందరికీ ఇచ్చేస్తున్నారు. మంచిదే అయినా పదవిని ముణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దు. YSR, జ్యోతిబసు, నవీన్‌పట్నాయక్‌లా పూజలు అందుకునేలా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయం ఆలోచించండి అని ఆ లేఖలో ప్రస్తావించారు. 
 
ముద్రగడపై టీడీపీ, జనసేన కాపు నేతల కామెంట్స్‌?

ఇలా ఓ పక్క సీఎం జగన్‌ను కీర్తిస్తూ.. మరోపక్క తమ డిమాండ్‌ను గుర్తు చేయడంలో ఉన్న ట్విస్ట్‌ దేనికోసం అన్న చర్చ మొదలైంది. అప్పటికే జనసేన, టీడీపీలోని కాపు నేతలు ముద్రగడను మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ కార్నర్‌ చేస్తున్నారు. ఈ లేఖ తర్వాత ఆ డోస్‌ పెరిగింది. ఇదే క్రమంలో తనను ఒంటిరిని చేసి కాపు సోదరులతోనే తిట్టిస్తున్నందుకు మనస్తాపం చెందానని.. అందుకే ఉద్యమానికి ఇక సెలవ్‌ అని లేఖ విడుదల చేశారు ముద్రగడ. 

పవన్‌ జత కలవడంతో ముద్రగడ బీజేపీలోకి వెళ్లలేదా?

నిజంగానే.. కాపు నేతల విమర్శలకు మనస్తాపంతోనే ముద్రగడ ఈ లేఖ రాశారా లేక.. కాపు ఉద్యమ పంథా మార్చడానికా అన్న విషయాలు కొత్తగా చర్చలోకి వచ్చాయట. ఆ మధ్య రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ బీజేపీ చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో జత కలవడంతో.. ముద్రగడ ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్లు కామెంట్స్‌ వినిపించాయి. అందుకే ముద్రగడ రూట్‌ మార్చారని అనుకుంటున్నారు. 
 
కొత్త జేఏసీ ఏర్పాటులో ముద్రగడ మద్దతుదారులు?

తనను కలుస్తున్న జేఏసీ నేతలతో సైతం.. చాలా కటువుగానే ముద్రగడ మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ సామాజికవర్గం నేతల నుంచే ఉద్యమం మళ్లీ పుట్టుకురావాలని తనను కలిసిన నేతలతో ఆయన గట్టిగా చెబుతున్నారట. దాంతో ముద్రగడ మద్దతుదారులతో కొత్త కాపు జేఏసీ ఏర్పాట్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ వేదిక ద్వారా ఉద్యమం ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తారట. 
 
కాపులు జనసేన వైపా.. ముద్రగడ వైపో తేల్చుకుంటారా?

అంతేకాదు.. ముద్రగడపై కామెంట్స్‌ చేస్తున్నవారిలో జనసేన నేతలు ఎక్కువగా ఉన్నారట. అందుకే కాపులు జనసేన వైపా.. ముద్రగడ వైపో తేల్చుకునే పనిలో కూడా పడ్డారట. ఇదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారట. బీజేపీతో జత కలిసిన జనసేన కాపుల రిజర్వేషన్ల సాధనకు ఏం చేస్తుందని ప్రశ్నిస్తారని సమాచారం. కాపులను టీడీపీ మోసం చేసిందనేది జనాల్లోకి తీసుకెళ్తారని కూడా అనుకుంటున్నారు. ఇలా ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు ఉద్యమ పంథా మారబోతున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.