3 రాజ‌ధానుల‌పై రెఫరెండం కోరాలి... రెబ‌ల్ ఎంపీ డిమాండ్..!

3 రాజ‌ధానుల‌పై రెఫరెండం కోరాలి... రెబ‌ల్ ఎంపీ డిమాండ్..!

మూడు రాజధానుల‌పై రెఫ‌రెండం కోరాల‌ని డిమాండ్ చేశారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. దీనిపై అమరావతి రైతులతో పాటు, రాష్ట్ర ప్రజల‌ను కూడా రెఫ‌రెండం కోరాల‌న్న ఆయ‌న‌.. రైతులారా.. ప్రజలారా.. ఆందోళన పడకండి న్యాయ మార్గాల ద్వారా, గాంధేయమార్గo ద్వారా మీ నిరసనను తెలియజేయండి అంటూ పిలుపునిచ్చారు. కొత్త ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారి రాజధానిని మార్చాలని అనుకోవడం అవివేకమైన చ‌ర్య‌గా వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. రాజధాని అని పిలిచినంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెంద‌ద‌న్నారు. ఒక సామాజిక వర్గం బలపడుతుందేమోనని రాజధానిని విశాఖ తరలించడం సరైన చర్య కాద‌ని కామెంట్ చేశారు. విభజన చట్టం, సెక్షన్- 6 ప్రకారం నియమించబడిన శివరామ కృష్ణన్ కమిటీని కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం అమలు పరచడం త‌గ‌ద‌న్నారు.

పార్టీలతో,  ప్రజలతో చర్చించకుండా ఏకపక్షంగా మూడు రాజధానుల నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ప్ర‌శ్నించారు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఓ ఉన్నతాధికారి ప్రతి సందర్భంలో ప్రభావితం చేస్తున్నార‌ని విమ‌ర్శించిన ఆయ‌న‌.. మంత్రి, సేనాపతి, బట్రాజు పాత్ర అన్నీ ఆ అధికారే పోషిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏర్పడిన హైకోర్టు కేవలం గవర్నర్ ఆమోదించినంతమాత్రాన కర్నూలుకు తరలడం అసాధ్య‌మ‌న్న వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని తప్పుదోవపట్టిస్తున్నార‌ని.. నాలుగు దేశాల కలయిక వల్ల చారిత్రక కారణాలతో అక్కడ మూడు రాజధానులు ఏర్పడ్డాయ‌ని గుర్తు చేశారు. రాజ్యాంగ నిబంధనలు లేదా సుప్రీంకోర్టు నిర్ణయాలవల్ల కర్నూలు న్యాయ రాజధాని ఆగిపోతే ఆ ప్రాంత ప్రజలు మరోసారి  భంగపడతార‌న్నారు. ఇక‌, దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తుంటే,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రాజధాని మార్పు పై దృష్టి సారిస్తోంద‌ని ఎద్దేవా చేశారు ర‌ఘురామ‌కృష్ణంరాజు.