చంద్రబాబును చూసి ఎవ్వరూ ఓటు వేయొద్దు-జేసీ

చంద్రబాబును చూసి ఎవ్వరూ ఓటు వేయొద్దు-జేసీ

ఎప్పుడైనా తనదైన శైలిలో... ఏ అంశంపైనైనా సెటైర్లే వేసే జేసీ దివాకర్ రెడ్డి... మహానాడు వేదికగా సంచలన కామెంట్లు చేశారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబును చూసి ఎవ్వరూ ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు... అదేంటి? జేసీ అలా మాట్లాడడమేంటి అనుకుంటున్నారేమో... ఆయన అభిప్రాయం కరెక్ట్ గానే చెప్పారు... చంద్రబాబును చూసి ఎవ్వరూ ఓటు వేయొద్దు... ప్రజలు వారి భవిష్యత్ కోసం టీడీపీకి ఓటు వేయాలని కోరారు. 

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించొద్దని సలహాఇచ్చారు జేసీ... సీఎం చుట్టూ భజనపరులు చేరారని... సామాన్యప్రజలు తమ కష్టం చెప్పుకునేందుకు అవకాశం చిక్కడం లేదని చెప్పుకొచ్చారు జేసీ. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుందన్నారాయన. ప్రధానిగా ఉండే వ్యక్తి హుందాగా వ్యవహరించాలన్న జేసీ... చిల్లర వ్యవహారాలు చేసే వ్యక్తి ప్రధాని కాకూడదన్నారు. ఇక జగన్‌ తాత బుద్దులు పుణికి పుచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు... 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరాలని తనకు ఆహ్వానం వచ్చిందన్నారు. జగన్ తరఫున విజయసాయిరెడ్డి రాయబారానికి వచ్చారన్నారు. వచ్చినవాళ్లు వైసీపీలో చేరాలని అడగకుండా ఎంత కప్పం కడతారని అడిగారని గుర్తు చేసుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. 

బీజేపీతో వైఎస్ జగన్ కొత్త బంధుత్వం చేస్తున్నారని... రూ.15 వందల కోట్లు మోడీ నుంచి జగన్ త్వరలోనే తెచ్చుకోబోతున్నారని ఆరోపించారు ఎంపీ జేసీ... అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు... ఎందుకంటే జగన్ తెచ్చుకున్న డబ్బులను ఎవ్వరికీ ఇవ్వబోరని సెటైర్లు వేశారు. జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు రావాలి... రాష్ట్ర రాజకీయాలు లోకేష్ చూసుకోవాలని సూచించారు జేసీ. ఇక పోలవరంలో జరిగిన అవకతవకలలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి లబ్ధిపొందారని విమర్శించారు. మరోవైపు బీజేపీతో కలసి పనిచేయడం కుదరదని ప్రారంభంలోనే చంద్రబాబుకు చెప్పానని గుర్తుచేసుకున్న అనంతపురం ఎంపీ... మోడీ ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదని చెప్పానన్నారు.