నా తప్పు చెబితే ముక్కు నేలకు రాస్తా...

నా తప్పు చెబితే ముక్కు నేలకు రాస్తా...

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు... నా తప్పు ఏంటో చెబితే మీ ఇంటికొచ్చి ముక్కు నేలకి రాస్తానని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏ తప్పు చేశానో నాకైతే తెల్వదన్న మోత్కుపల్లి... పాలనా తప్పు చేశావు అని చెబితే సంతోషపడతానన్నారు. డబ్బులు లేకున్నా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా... కానీ, నీతి పనిచేయడం లేదు, డబ్బులు, కులం... రెండూ ఉండాలి... అవి లేకపోవడమే నా దుస్థితికి కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సీనియర్ నేతనైనా నాకు ఇంత అవమానమా అని ప్రశ్నించిన మోత్కుపల్లి... నేను ఏ నేరం చేయకున్నా పార్టీ నుండి బయటకు పంపే పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. 5 నిమిషాలు కూడా మాట్లాడడానికి తనకు టైం ఇవ్వలేదని విమర్శించిన మోత్కుపల్లి... రేవంత్ రెడ్డికి అడ్డంగా మాట్లాడినందుకే నన్ను ఆలా చేస్తున్నారన్నారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీని పతనం చేస్తాం అని రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు టీడీపీని బలిచేశారని ఆరోపించారు మోత్కుపల్లి... ఆ మూర్ఖుడు రేవంత్ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని... జూనియర్ అయిన రేవంత్ రెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పారని ప్రశ్నించారు... ఎందుకంటే ఆయన రెడ్డి, డబ్బు ఉంది కాబట్టే ఆయన పేరు ప్రకటించారని విమర్శించారు. రేవంత్ ఎన్ని తప్పులు చేసినా పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించిన మోత్కుపల్లి... ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పినా చంద్రబాబుకు ఎందుకు స్పందించలేదంటూ సూటిగా అడిగారు. పార్టీలో సీనియర్ నేతనైన నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మోత్కుపల్లి. కేబినెట్‌ మొత్తం తీసుకుని రేవంత్ రెడ్డి కూతురు పెళ్లికి పోతారు... కానీ, నా బిడ్డ పెళ్లి పిలిస్తే సాయంత్రం వచ్చారని ఆరోపించారాయన. కేసీఆర్‌ను పిలవగానే పెళ్లికి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారాయన. ఇక రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆప్రూవర్‌గా మారుతాడనే భయం చంద్రబాబుకు పట్టుకుందని సెటైర్లు వేశారు మోత్కుపల్లి.