ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి: రోజా 

ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి: రోజా 

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలకు, ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏపీ సీఎం, సినీ నటుడు శివాజీ కలిసి ఆపరేషన్‌ గరుడ పేరుతో వైఎస్‌ జగన్‌ ని చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు, ప్లాన్‌లో భాగంగానే శివాజీ అమెరికా పారిపోయారని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేబినేట్‌ సమావేశంలో శివాజీ పాల్గొన్నారని వార్తలు కూడా వచ్చాయని చెప్పారు. టీడీపీతో సంబంధం లేకపోతే అతన్ని ఇంతవరకూ అరెస్ట్‌ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే అది ఒట్టి డ్రామా అని సీఎం చంద్రబాబు కొట్టి పారేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌పై జరిగింది హత్యాయత్నం అని రిమాండ్‌ రిపోర్ట్‌లో స్పష్టంగా తెలిపారన్నారు. క్రిమినల్‌ కేసులున్న శ్రీనివాస్‌కి ఎన్‌వోసీ తీసుకుని ఎందుకు తన వద్ద పెట్టుకున్నాడో హర్షవర్దన్‌ చౌదరి చెప్పాలని రోజా డిమాండ్‌ చేశారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే ఎందుకు కుట్రకోణంలో విచారించటం లేదని చంద్రబాబుకు సూటిగా ప్రశ్నవేశారు. సోమిరెడ్డి ఒక సోంబేరి రెడ్డిలా తయారయ్యారని, ఐదుసార్లు ఓడిపోయినా, నెల్లూరు ప్రజలు ఛీకొట్టినా మంత్రి పదవి కట్టబెట్టి చంద్రబాబు వెర్రికూతలు కూయిస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించి టీడీపీ నేతలు రౌడీల్లాగా, గూండాల్లాగా దిగజారి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.