అనుభవ రాహిత్యం పదే పదే బయటపడుతోందా?

అనుభవ రాహిత్యం పదే పదే బయటపడుతోందా?

అనుభవ రాహిత్యం పదే పదే బయటపడుతోందా? అధినేతను ప్రసన్నం చేసుకోవాలనుకునే ప్రయత్నాలు రివర్స్‌ అయ్యి.. ఆయన ఆగ్రహానికి కారణం అవుతున్నారా? మంచి మార్కులు కొట్టేయాలంటే ఏదీ కలిసి రావడం లేదా? ఇంతకీ ఆయన తొందర పడుతున్నారా? తడబడుతున్నారా? ఎవరాయన? ఏమా కథ?

సీఎం దృష్టిలో పడేందుకు ప్రయోగాలు!

 కేబినెట్‌లో చోటు సంపాదించడం ఒక ఎత్తు. ఆ స్థానాన్ని పదిల పర్చుకోవడం మరో ఎత్తు. ఇందుకోసం మంత్రులు చేయని ప్రయత్నం ఉండదు. కొన్నిసార్లు ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు తమ పరిధిలో ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఈ ప్రయోగాలు సక్సెస్‌ అయితే సరి.. బెడిసి కొడితే మాత్రం తల పట్టుకోవాల్సిందే. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రస్తుతం ఇదే స్థితిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

బయో టాయిలెట్స్‌ ఆన్‌ వీల్స్‌ బస్సు రంగుపై సీఎం అసంతృప్తి!

మంత్రిగా ఆయన తీసుకుంటున్న చర్యలు.. అధినేతను మెప్పించడం మాటేమో కానీ.. ముఖ్యమంత్రే స్వయంగా జోక్యం చేసుకుని.. అజయ్‌ దూకుడికి బ్రేక్‌లు వేస్తున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా మహిళల కోసం సిద్ధం చేసిన బయో టాయిలెట్స్‌ ఆన్‌ వీల్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పింక్‌ కలర్ వేయడాన్ని తప్పుపట్టారు. వెంటనే గులాబీ రంగును తొలగించాలని మంత్రి అజయ్‌ కుమార్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి. 

మంత్రి అజయ్‌ ట్వీట్‌తో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైందా?

ఖమ్మంలో ఇటీవలే ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను మంత్రి అజయ్‌  సిద్ధం చేయించారు.   కలెక్టర్‌ కర్ణనన్‌, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వీటిని పరిశీలించారు. అన్ని మున్సిపాలిటీలలో ఇలాంటి  బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రయత్నం బాగానే ఉన్నా.. ఆ బస్సులకు వేసిన రంగు చూసి సీఎం నొచ్చుకున్నారట. దీంతో రంగులు మార్చాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ సందర్భంగా అజయ్‌ చేసిన ట్వీట్‌ పార్టీలో చర్చకు కారణమైంది. సీఎం ఆదేశాలతో రంగులు మారుస్తున్నట్లు చెప్పి ఊరుకుంటే సరిపోయేది. కానీ.. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకే పింక్‌ కలర్‌ వేసినట్లు మంత్రి అజయ్‌ ట్వీట్‌ చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు కారణమైంది. 

అప్పట్లో  సరుకు రవాణా బస్సులపై సీఎం కేసీఆర్ ఫొటోలు!

గతంలోనూ మంత్రి పువ్వాడ అజయ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్టీసీ సరుకు రవాణా సేవల ప్రారంభం సందర్భంగా బస్సులపై సీఎం కేసీఆర్‌ ఫొటోలు కూడా ఉండలన్నారు. అధికారులు అలాగే చేశారు. విషయం తెలుసుకున్న సీఎం.. అప్పట్లో ఇదే విధంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మంత్రిగా పువ్వాడ అజయ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆయనకు బెడిసికొడుతుందని పార్టీలోనూ, ఆర్టీసీలోనూ గుస గుసలాడుకుంటున్నారు.