మూవీ రివ్యూ : 'మెహబూబా'

మూవీ రివ్యూ : 'మెహబూబా'

నటీనటులు : ఆకాష్ పూరి, నేహా శెట్టి, మురళీశర్మ, షాయాజీ షిండే, విష్ణు రెడ్డి తదితరులు  

ఛాయాగ్రహణం :  విష్ణు శర్మ  

సంగీతం : సందీప్ చౌతా 

సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్  

నిర్మాణం : పూరి కనెక్ట్స్ 

సమర్పణ : శ్రీమతి లావణ్య

దర్శకత్వం : పూరి జగన్నాథ్ 

విడుదల తేదీ : 11 మే 2018

 

 

'నా హీరోలు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు' - 'మెహబూబా' విడుదలకు ముందు పూరి చెప్పిన మాట. నిజమే... పూరి తీసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ, హీరోలు ఫెయిల్ కాలేదు. హీరోలకు మాస్ మేకోవర్ ఇచ్చిన దర్శకుల్లో పూరి ముందు వరుసలో వుంటాడు. ఆ నమ్మకంతోనే తనయుణ్ణి తన స్వీయ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని భావించి ఉంటారు. ఈ సినిమాకి ముందు పూరి ఫ్లాపుల్లో ఉన్నారు. దాంతో సినిమాపై ఎవరికీ ఆసక్తి కలగలేదు. ప్రచార చిత్రాలు విడుదలైన తరవాత ఒక్కసారి సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలైంది. దీనికి తోడు హిట్ సినిమాల నిర్మాత 'దిల్' రాజు సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. 'పూరి మనసు పెట్టి తీస్తే ఇలాంటి సినిమా వస్తుంద'ని చెప్పడం, ఆయనే సినిమాను విడుదల చేయడం సినిమాపై ప్రేక్షకుల్లో నమ్మకం కలిగేలా చేసింది. మరి, పూరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? హీరోగా ఆకాష్ పూరి సక్సెస్ అయ్యాడా? రివ్యూ చదివి తెలుసుకోండి! 

 

కథ : అది 1971... ఇండో-పాక్ యుద్ధం జరుగుతోంది. సరిహద్దుల్లోని ఓ భారతీయ గ్రామాన్ని పాక్ సైన్యం తమ అధీనంలోకి తెచ్చుకుంటుంది. పాక్ సైనికుడు కబీర్ (ఆకాష్ పూరి), ఆ గ్రామంలోని అమ్మాయి మధీర (నేహా శెట్టి) ప్రేమలో పడతారు. యుద్ధం ముగిశాక కబీర్ పాకిస్థాన్ వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తరవాత మధీర కోసం భారత్ భూభాగంలో అడుగు పెడతాడు. సైనికుల చేతిలో అతడు, వాతావరం చేతిలో ఆమె మరణిస్తారు. కట్ చేస్తే 2017... కబీర్ ఇండియాలోని హైదరాబాద్‌లో రోష‌న్‌గా పుడతాడు. పాకీస్థాన్‌లోని లాహోర్‌లో ఆఫ్రీన్‌గా మధీర పుడుతుంది. ఇద్దరికీ చిన్నప్పటి నుంచి గత జన్మ జ్ఞాపకాలు కలలుగా వస్తుంటాయి. రోషన్ ఇండియన్ ఆర్మీలో చేరాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. చదువు పేరుతో ఆఫ్రీన్ హైదరాబాద్ వస్తుంది. గత జన్మలో ప్రేమను గెలిపించుకోలేని వీళ్లిద్దరూ ఈ జన్మలో ఎలా గెలిపించుకున్నారు? అనేది చిత్రకథ.   

 

నటీనటుల పనితీరు : 

పూరి జగన్నాథ్ హీరోలు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆకాష్ పూరితో సహా. వయసుకు తగ్గ పాత్ర కావడంతో సులభంగా చేశాడు. హీరోయిన్‌ని కాపాడే ఫైట్‌లో, 'మేరీ మెహబూబా జిందాబాద్' అని చెప్పే సన్నివేశంలో అతడి నటన బాగుంది. బాలనటుడిగా కొన్ని సినిమాలు చేయడంతో ఫస్ట్ టైమ్ హీరో అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. నేహా శెట్టి చూడటానికి బావుంది. అమ్మాయికి తొలి సినిమా కావడంతో ఆమె నుంచి ఎక్కువ ఆశించలేం. అయితే.. ఇద్దర్నీ పక్క పక్కన చూసేటప్పుడు ఆకాష్ కంటే నేహా వయసు ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. ఆకాష్ తండ్రి పాత్రలో షాయాజీ షిండేతో  కామెడీ చేయించాలని ప్రయత్నించారు. కాని కుదరలేదు. తల్లి పాత్రలో చేసిన నటి అతి చేశారు. నేహా శెట్టి తండ్రిగా మురళీ శర్మ చక్కటి అభినయాన్ని కనబరిచారు. విలన్‌గా విష్ణు రెడ్డి గెటప్ సూట్ అయ్యింది.  యాక్టింగ్ కొంచెం ఓవర్ అయ్యింది. పూరి 'పోకిరి'లో మాఫియా గ్యాంగులో నటించిన మహిళ గుర్తుందా? జ్యోతిరానా. ఆమెను బోర్డర్‌లో ఇండియన్ ఆర్మీ అధికారి పాత్రలో ప్రేక్షకులు గుర్తించడం కష్టమే. మిగతా నటీనటులకు పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు లభించలేదు.   

 

సంగీతం - సాంకేతిక వర్గం : 

సందీప్ చౌతా స్వరపరిచిన పాటల్లో 'ఓ ప్రియా..', 'నా ప్రాణమా..' పాటలు మనసుకు హత్తుకుంటాయి. ముఖ్యంగా 'ఓ ప్రియా...' పాటలో 'కంటికి కన్నీరు కాపలా... మన మట్టి మీద పగబట్టి సరిహద్దులు గీశారు...'  భాస్కరభట్ల అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ ఏడాది వచ్చిన, వచ్చే అద్భుతమైన పాటల్లో ఇది తప్పకుండా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మిగతా పాటలు సోసోగా ఉన్నాయి. థియేటర్ బయటకు వచ్చిన తరవాత గుర్తుపెట్టుకోవడం కష్టమే. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బావుంది. ఒకట్రెండు సన్నివేశాల్లో మినహాయిస్తే అద్విత క్రియేటివ్ స్టూడియో చేసిన విజువల్ ఎఫెక్ట్స్ రియల్ అనిపించేట్టు చేశారు. రియల్ సతీష్ కథకు తగ్గట్టు  ఫైట్స్‌ డిజైన్ చేశారు. ఎడిటర్ కత్తెరకు చాలా పదును పెట్టాల్సింది. సెకండాఫ్‌లో ప్రేక్షకుణ్ణి సినిమాలోంచి పక్కకు తీసుకువెళ్లే సన్నివేశాలు చాలా ఉన్నాయంటే... వాటిలో నిడివి ఎక్కువ ఉన్న సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. 

 

దర్శకత్వం : 

పునర్జన్మల కథకు పూరి ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్ కొత్తగా ఉంది. ఇంటర్వెల్ వరకూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తూ వచ్చిన పూరి జగన్నాథ్  తరవాత అంతగా ఆకట్టుకోలేదు. ఆయన రాసిన మాటల తూటాలు కూడా పేలలేదు. ఆయన శైలికి భిన్నంగా ఉంటుందీ సినిమా. పూరి జగన్నాథ్‌లో దర్శకుణ్ణి ప్రతిసారీ మాటల రచయిత డామినేట్ చేస్తుంటాడు. ఆయనలో కథకుడిని వెనక్కి నెట్టి రచయిత ముందుకు వస్తుంటాడు. ఈసారి కథకుడు కాస్త ముందుకు వచ్చాడు. కాని రచయితే వెనక్కు వెళ్లాడు. 

 

విశ్లేషణ :

కథగా చెప్పుకుంటే ఇదేమీ కొత్తది కాదు. 'జానకి రాముడు' నుంచి 'మగధీర' వరకూ... అంతకు ముందు ఆ తరవాత... పునర్జన్మల నేపథ్యంలో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే... పూరి జగన్నాథ్ ఇటువంటి కథతో సినిమా తీయడం తొలిసారి. పిచ్ మీద, గ్రౌండ్ మీద గ్రిప్ వ‌స్తే స్టార్ బౌలర్ ఎలా చెలరేగుతాడో... ఫస్టాఫ్ మొదలైన వెంటనే కాసేపు పూరి అలా చెలరేగాడు. 'సేవ్ టైగర్స్ అనేవాడు ఎవడూ పులిని ఇంట్లో పెంచుకోడు సరికదా.. పక్కింట్లో వాళ్లు పెంచుకుంటే వాళ్ల దగ్గరకి కూడా వెళ్లరు' అని చెప్పే సన్నివేశంలో పూరిలోని రచయితలో ఫైర్ తగ్గలేదని చెప్పడానికి నిదర్శనం. అందులో 'మనుషులు చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్ది' పూరి రాసిన డైలాగ్ బాగా పేలింది. తరవాత పాకిస్థాన్ జిందాబాద్ అని హైదరాబాదీలు అనే సన్నివేశంలోనూ పూరి చెలరేగాడు. ఫస్టాఫ్‌లో ఇటువంటి బౌన్సర్ డైలాగులు కొన్ని, సన్నివేశాలు కొన్ని సినిమాలో ఉన్నాయి. కాని ఆ తరవాత తరవాత సేమ్ ఫైర్ కంటిన్యూ కాలేదు. ఇంటర్వెల్ ఊహించేది అయినప్పటికీ అందులో ట్విస్ట్ కొత్తగా ఉంటుంది. తరవాత నుంచి కథ, కథనం నెమ్మదిగా ముందుకు సాగాయి. పూరి బౌన్సర్లలో వేగం తగ్గింది. ప్రేమకథలో గాఢత అంతగా లేదు. ప్రేక్షకులు ఆ ప్రేమను ఫీలవ్వడం కష్టమే. దాంతో 'మెహబూబా' అనే ఈ మ్యాచ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని, ఉత్కంఠను కలిగించడంలో విఫలం అయ్యింది. దీనికి తోడు సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయిజాన్' స్పూర్తితో సెకాండఫ్ సన్నివేశాలు రాసుకున్నట్టు అనిస్తాయి. అయితే... పూరి మేకింగ్, టేకింగ్ సినిమాను కొత్తగా ఫీలయ్యేలా కొంతవరకూ సహాయపడ్డాయి. ఇటీవల పూరి తీసిన సినిమాలతో పోలిస్తే ఇందులో మార్పు కనిపించింది. కాని 'పూరి ఈజ్ బ్యాక్' అని చెప్పడానికి, 'మెహబూబా' మస్తుందని కితాబు ఇవ్వడానికి ఆ మార్పు చాలదు. ఇంకా ఇంకా కావాలి. అయితే... కుమారుడికి గ్రేట్ లాంఛ్ ఇవ్వలేకపోయిన పూరి, అతడి వయసుకు తగ్గట్టు పర్ఫెక్ట్ లాంఛ్ ఇచ్చాడని చెప్పవచ్చేమో! అతడు హీరోగా నిలబడటానికి, సక్సెస్ కావడానికి మరింత ఫైర్ ఉన్న కథ, దర్శకత్వం కావాలి.