ఇవాళ భూమిపై సౌర తుఫాను

ఇవాళ భూమిపై సౌర తుఫాను

సూర్యునిలో చోటు చేసుకుంటున్న కొన్ని రసాయన మార్పుల కారణంగా ఇవాళ భూమిపై సౌర తుఫాను సంభవించే అవకాశముందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ తీసిన ఓ ఫోటోలో.. సూర్యుని బాహ్య పోరలో ఓ రంధ్రం కనిపిస్తోంది. ఇక్కడి నుంచే సూర్యుడి అయస్కాంత క్షేత్రం తెరచుకుని భారీ పరిమాణంలో వాయువులు బయటకు వస్తున్నాయి. అక్కడి నుంచే భారీ పరిమాణంలో కాస్మిక్ రేణువులు ఒక మేఘంలో ఏర్పడి భూగోళం వైపుగా దూసుకొస్తొంది. దీనినే అయస్కాంత తుఫాను లేక సౌర తుఫానుగా పిలుస్తారు. ఈ తుఫానులను ఐదు రకాలుగా వర్గీకరించారు. అవి జీ1, జీ2, జీ3, జీ4, జీ5... వీటిలో జీ5 అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతారు.. ఇది సంభవిస్తే జరిగే పరిణామాలు ఊహించలేమట. తాజా సౌర తుఫాను ప్రభావం భూ అయస్కాంత ఆవరణంపై పడి బాహ్య వాతావరణం దెబ్బతింటుందని.. ఉపగ్రహ వ్యవస్థకు అంతరాయం కలిగి.. జీపీఎస్, సెల్‌ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ ఆధారిత సేవలకు స్వల్ప ఆటంకం కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.