కరోనా ప్రమాద కరం కాదంటూ వీడియో రిలీజ్ చేసి...ఆ కరోనాకే !

కరోనా ప్రమాద కరం కాదంటూ వీడియో రిలీజ్ చేసి...ఆ కరోనాకే !

కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు కన్ను మూశారన్న సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాల రావు, అనంతర పరిణామాల్లో మంత్రి పదవికి రాజీనామా చేసి వైదొలిగారు. ఫోటోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన 2014లో తాడేపల్లి గూడెం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాక బీజేపీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయనకు గత నెల నాలుగున కరోనా సోకింది. సోకిన సమయంలో ఆయనే వీడియో ఒకటి రిలీజ్ చేసి తెలియచేశారు. ఆ సమయంలో పాజిటివ్ నిర్దారణ అయిన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన బీజేపీ నేతతో కాంటాక్ట్  ఉన్న వాళ్ళకి పరీక్షలు నిర్వహించగా మాజీ మంత్రికి పాజిటివ్ నిర్దారణ అయింది.
దీంతో అప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇదేదో దాచుకునే జబ్బు కాదన్న ఆయన తన మిత్రుడి ద్వారా ఈ కరోనా సోకిందని అన్నారు. ఈ వైరస్ గురించిన జాగ్రత్తలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదేదో ఎయిడ్స్ లాంటి రాకూడని వ్యాధి కాదని, గాలి ద్వారా కూడా ఇది సోకుతుండడంతో మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

ఇది సోకినా ఏమీ కాదని, కానీ ఏదయినా గుండె సంబందింత, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్టగా ఉండాలని పేర్కొన్నారు. మాస్క్ వాడుతూ, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఒక్కటే దీనికి దూరంగా ఉండే దారి అని ఆయన పేర్కొన్నారు. అయితే అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అప్పటి నుండి విజయవాడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల నుండి ఆయన ఆరోగ్యం బాలేనప్పటికీ నిన్నటి రాత్రి నుండి పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుండి ప్రత్యేక వైద్య బృందం వచ్చి ఆయన ఆరోగ్యం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఈరోజు మధ్యాహ్నం కొద్ది సేపటి క్రితం కన్నుమూసినట్టు చెబుతున్నారు.