భార్యను చంపమన్నారని ముగ్గురక్కల మీద మర్డర్ అటెంప్ట్...ఇద్దరు మృతి !

భార్యను చంపమన్నారని ముగ్గురక్కల మీద మర్డర్ అటెంప్ట్...ఇద్దరు మృతి !

హైదరాబాద్‌లో ఓ ఉన్మాది సొంత అక్కలనే పొట్టన పెట్టుకున్నాడు. అక్కలను చంపేందుకు ముందుగానే ప్రణాళిక రచించి అమ్మకు బాలేదని వచ్చి చూడాలని పిలిచి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కలు ప్రాణాలు కోల్పోగా మరొక ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాలాకు చెందిన అహ్మద్ ఇస్మాయిల్ (27) ఒకప్పుడు బౌన్సర్ గా పనిచేసే వాడు.

తల్లితో కలిసి నివసిస్తున్న ఇస్మాయిల్ తల్లికి ఆరోగ్యం బాగాలేదని, వెంటనే రావాలని నలుగురు అక్కలకు కబురుపెట్టాడు. నిన్న ఉదయం 11 గంటలకు ఇంటికి వచ్చిన అక్కలు రజియాబేగం, జకీరాబేగంలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత మూడో సోదరి నూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపైనా కత్తితో దాడికి దిగాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బావ పైనా దాడి చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే రజియా బేగం మరణించగా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జకీరాబేగం, నూరాబేగం, ఉమర్‌లను ఆసుపత్రికి తరలించారు. అయితే జకీరాబేగం కూడా ఆసుపత్రికి వెళ్ళే లోపు చనిపోయింది. నాలుగో అక్క మలికా బేగంను చంపాలని ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఆమెను వేరే చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారని తెలుసుకుని వారి మీద దాడి చేసేందుకు ఓవైసీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న పోలీసులను చూసి వెన్నకు వచ్చేశాడు.

అయితే అతనికి దారిలో బంధువు కనిపించాడు. తన అక్కలు చెప్పడం వల్లనే తాను భార్యను చంపానని, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నానని అతనితో చెప్పినట్లు సమాచారం.
అయితే మొన్న ఆదివారం ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు కలుసుకున్నారని, ఆ తర్వాతే నిందితుడు హత్యకు పథకం రచించినట్టు పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.