టీఆర్‌ఎస్‌లో ఎక్స్‌టెన్షన్‌, టెన్షన్‌ పదాలపై జోరుగా చర్చ!

టీఆర్‌ఎస్‌లో ఎక్స్‌టెన్షన్‌, టెన్షన్‌ పదాలపై జోరుగా చర్చ!

అధికార పార్టీలో ఇప్పుడు రెండు పదాలే చక్కర్లు కొడుతున్నాయా? వాటి గురించే విస్తృతంగా చర్చించుకుంటున్నారా? ఇదే అంశం కొందరిలో టెన్షన్‌ పుట్టిస్తోందా? ఇంకొందరు అటెన్షన్‌ అంటున్నారా? ఇంతకీ ఆ పదాలేంటి? లెట్స్‌ వాచ్‌.

అప్పట్లో 40 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు!

తెలంగాణలో నామినేటెడ్‌ పదవులు పొందిన వారిలోనూ.. పదవీకాలం ముగిసిన వారిలోనూ అలజడి మొదలైందట. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన తర్వాత చాలా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. పార్టీలో మొదటి నుంచీ ఉంటున్నవారితోపాటు రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని దాదాపు 40 వరకూ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వీరిలో కొందరికి రెండేళ్లు.. మరికొందరికి మూడేళ్లు  చైర్మన్‌గా ఉండేలా ఛాన్స్‌ లభించింది. 

కొందరు మాత్రమే ఎక్స్‌టెన్షన్‌  పొందారు!

పదవీకాలం ముగిసిన తర్వాత కొందరికి మాత్రమే మరోసారి అవకాశం కల్పించింది టీఆర్‌ఎస్‌. అలా ఎక్స్‌టెన్షన్‌ పొందిన వారిలో  అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కోలేటి దామోదర్‌గుప్త, వి. ప్రకాష్‌, మందుల సామ్యేల్‌, కంచర్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. మరి.. మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారట. ఎక్స్‌టెన్షన్‌ రానివారిలో టెన్షన్‌ మొదలైందట. దీంతో పార్టీలో ఎవరి నోట విన్నా.. ఎక్స్‌టెన్షన్‌.. టెన్షన్‌ అనే పదాలు విస్తృతంగా చర్చలో ఉన్నాయి. 

ఎక్స్‌టెన్షన్‌ పొందని నేతల పరిస్థితి ఏంటి? 
కొత్తగా పదవులు ఆశిస్తున్నవారు తక్కువేం లేరా?

కార్పొరేషన్లలో  పదవీ కాలం పూర్తయిన వారిలో చిరుమళ్ల రాకేష్‌, వాసుదేవరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, గుండు సుధారాణితోపాటు మరికొందరు ఉన్నారు. వీళ్ల పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదట. ఎక్సటెన్షన్‌ ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాల టాక్‌. ఇప్పటికే పదవీకాలం పొడిగింపుతో గట్టెక్కిన నేతలు హ్యాపీగా ఉన్నారట. అయితే పదవీకాలం పూర్తయిన వారిని మళ్లీ తలచుకోకపోవడానికి మరో కారణం కూడా ఉందని సమాచారం. పదవులు ఆశిస్తున్నవారు పార్టీలో చాలా మంది ఉన్నారు. ఎప్పటి నుంచో గులబీ దళపతి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. పాతవాళ్లకు ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే.. మా సంగతి ఏంటని తమకు పరిచయం ఉన్నవారి నేతల దగ్గర తెగ టెన్షన్‌ పడుతున్నారట. 

ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసినవారు ఎదురు చూస్తున్నారా?

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావిడి లేదు. కార్పొరేషన్ల పదవుల భర్తీపై సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టే అవకాశం ఉండటంతో ఆశావహలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గతంలో హామీలు పొందిన వారు.. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారు అధినేత కరుణించకపోతారా అని  లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి పదవి ఇవ్వాలో... ఎవరెవరికి ప్రయార్టీ ఇవ్వాలో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు జాబితాలు సిద్ధం చేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం శ్రావణ మాసం. త్వరలో జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌ ప్రారంభోత్సవాలకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. అందుకే నామినేటెడ్‌ పదవులు కూడా భర్తీ చేస్తారని అనుకుంటున్నారు. మరి.. పార్టీ నేతల నుంచి అందిన పేర్లను పరిగణనలోకి తీసుకుంటారో.. బాస్‌ దృష్టిలో ఉన్న పేర్లకు పట్టం కడతారో చూడాలి.