వారికి లీగల్ నోటీసులు

వారికి లీగల్ నోటీసులు

అతి త్వరలో శ్రీవారి ఆభరణాలను ప్రదర్శనకు వుంచుతామని.. దీనిపై ఆగమ పండితుల సలహా తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఇవాళ అన్నమయ్య భవన్‌లో టీటీడీ బోర్డు సమావేశం జరిగింది.. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్, ఈవో మీడియాకు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. దళితవాడలు, గిరిజనవాడలు, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో 10 లక్షల రూపాయలతో ఆలయాలు నిర్మిస్తామని... చిత్తూరు జిల్లా నాగలాపురంలో వేదపాఠశాలను ఏర్పాటు చేస్తామని.. అలిపిరి వద్ద టాటా క్యాన్సర్ ఆసుపత్రికి ఏటా 25 లక్షల రూపాయలతో 33 సంవత్సరాలు లీజుకు ఇస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు.

2018-19 సంవత్సరానికి గానూ రూ. 4.84 కోట్లతో మందులు కొనుగోళ్లు చేస్తామని.. ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిదారులను ప్రొత్సహించేందుకు గానూ 2:9 శాతంతో పాలను కొనుగోలు చేస్తామని.. ఎస్వీ వేదిక్ యూనివర్శిటీకి అనుబంధంగా శ్రీ బాలాజీ వేద పరిపోషణ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని.. తిరుపతిలో సైన్స్ సిటీ మ్యూజియం కోసం 70 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని సుధాకర్ యాదవ్ తెలిపారు. భద్రతా విభాగం కోసం 1.6 కోట్లతో వీడియో వాల్ ఏర్పాటు చేస్తున్నామని.. ధర్మగిరి వేదపాఠశాలలో విద్యార్థులకు ప్రోత్సాహాలు అందచేసినట్లే.. వేదిక్ యూనివర్శిటీ విద్యార్థులకు అందజేస్తామని.. అమెరికాలోని అర్చకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఛైర్మన్ వెల్లడించారు. టీటీడీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి న్యాయపరంగా సలహాలు తీసుకుని.. వారికి లీగల్ నోటీసులు ఇస్తామని ఈవో స్పష్ఠం చేశారు.