పెళ్ళిళ్ళకెళ్ళాలంటే భయపడుతోన్న నేతలు !

పెళ్ళిళ్ళకెళ్ళాలంటే భయపడుతోన్న నేతలు !

పిలిచిన పేరంటానికి వెళ్లి ఫోజులు ఇవ్వడమంటే రాజకీయ నాయకులకు మహా సరదా. నలుగురిలో గౌరవం, మర్యాదలు, స్వాగతాలు అందుతుంటే ఆ హుందాతనమే వేరు. సెలబ్రిటీగా వెళ్లితే ఆ పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిలో వధూవరులతోపాటు కెమెరాలన్నీ వారివైపే క్లిక్‌ మనిపిస్తాయి. అందుకే ఎవరు పిలిచినా సెలబ్రిటీలు పెళ్లిళ్లు, ఫంక్షన్లను మిస్‌ కారు.  

ఏదో పార్టీ నేత కుమారుడి పెళ్లి జరుగుతోంది కదాని నాలుగు అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదిద్దామని వెళ్లారు. అక్కడ జరిగిన హఠాత్‌ పరిణామానికి ఖిన్నులయ్యారు. సీన్‌ కట్‌ చేస్తే అలా వచ్చిన నేతలపై SC,ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లుగా ఇరకాటంలో పడ్డారు ఆ మాజీ మంత్రులు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగిన తర్వాత ఏ ఫంక్షన్‌కు వెళ్లాలన్నా రాజకీయ నేతలు ఉలిక్కి పడుతున్నారు. వెడ్డింగ్‌ కార్డు వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచించి వెళ్లాలా వద్దా అని  అనుకుంటున్నారంటే.. ఇటీవల వైరల్‌ అయిన ఓ కేసు .. నాయకులను ఎంతగా భయపెట్టిందో అర్ధం చేసుకోవచ్చు. 

కాకినాడ రూరల్‌ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మూడో కుమారుడు రాధాకృష్ణ పెళ్లి ఈ నెల పదిన తొండంగి మండలం ఏవీ నగర్‌లో జరిగింది. ఈ వివాహానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు,  నిమ్మకాయల చినరాజప్ప హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతా హ్యాపీ మూడ్‌లో ఉన్న సమయంలో మంజుప్రియ అనే యువతి ఇచ్చిన ఎంట్రీకి ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వరుడు రాధాకృష్ణ భార్యను తానేనని.. నేనుండగా మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటున్నారని పోలీసులకు పిర్యాదు చేసింది మంజుప్రియ. 

వివాదం పెద్దదయ్యేలా ఉండటంతో పెళ్లి మండపం నుంచి మెల్లగా జారుకున్నారు మాజీ మంత్రులు. అయితే మంజుప్రియ ఊరుకోలేదు. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. రాధాకృష్ణ రెండో పెళ్లికి వచ్చిన మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరింది. 2011లోనే రాధాకృష్ణతో తనకు పెళ్లి జరగ్గా.. ఒక పాప, బాబు పుట్టారని తెలిపింది మంజుప్రియ.

రెండేళ్ల క్రితం తమ పెళ్లికి సంబంధించి పంచాయితీ నిర్వహించిన యనమల, చినరాజప్పలే ఇప్పుడు తన భర్తకు రెండో పెళ్లి చేశారని ఆరోపించింది. మంజుప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై పిల్లి అనంత లక్ష్మి దంపతులు, మాజీ మంత్రులు యనమల, చినరాజప్ప సహా ఏడుగురిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. యనమల A5 అయితే చినరాజప్పను A6గా కేసులో చూపించారు. 

హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్‌ తప్పించుకున్న నేతలు!

ఈ కేసు పూర్వాపరాలు.. జరగిన ఘటనలు.. వాస్తవాలు ఎలా ఉన్నా.. పెళ్లికి హాజరైన మాజీ మంత్రులపై SC, ST అట్రాసిటీ కేసు నమోదైందన్న విషయం మాత్రం సంచలనమైంది. ఇద్దరు మాజీ మంత్రులు హైకోర్టును ఆశ్రయించి అరెస్ట్‌ కాకుండా ఉపశమనం పొందారు. తమపై నమోదైన కేసు కొట్టేయాలని వారు కోరారు. పెళ్లి చేసే ముందు అటు ఏడు తరాలు.. ఇటు  ఏడు తరాలు ఆరా తియ్యాలంటారు. ఈ తాజా కేసుతో ఎవరి వివాహానికైనా వెళ్లాలంటే రాజకీయ నాయకులు సైతం వధూవరుల ఏడు తరాల చరిత్ర ఆరా తియ్యాలేమో? లేదంటే తర్వాతి కాలంలో ఏడు ఊసలు లెక్క పెట్టక తప్పదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  ఏది ఏమైనా నాలుగు అక్షింతలు వేసే ముందు నాలుగు రాళ్లు మనపై పడకుండా చూసుకోవడం మంచిది. ఏమంటారు?