ఓట్లు అడిగే హక్కు కేవలం మా పార్టీకే ఉంది...

ఓట్లు అడిగే హక్కు కేవలం మా పార్టీకే ఉంది...

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ... మహానాడు వేదికగా ఆయన ప్రసంగిస్తూ విజన్ 2020తో హైదరాబాద్‌, తెలంగాణ ప్రాంతాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్ చారిత్రాత్మకమైన నగరాలకు సైబరాబాద్‌ను జోడించి... లక్షల కోట్ల సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు రమణ. కేసీఆర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... వారి సమస్యలపై పోరాటం చేస్తున్నామని... మహానాడు వేదికగా దిశనిర్దేశం చేయనున్నట్టు తెలిపారు. 

కర్ణాటకకు వెళ్లి చంద్రబాబు మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయనే సంకేతాలు ఇచ్చారన్నారు రమణ... తెలంగాణలో 13 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ పార్టీని వీడారని... పాల మల్లారెడ్డిని ఎంపీని చేసిన ఘనత టీడీపీదే అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టిన రమణ... ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు పేదలకు ఉపయోగ పడడంలేదన్నారు. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో అన్ని రకాల మాఫియాలు పెట్రేగి పోయాయని ఆరోపించిన టి.టీడీపీ అధ్యక్షుడు... కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో బీసీలు బాధపడుతున్నారని... పాలితులు పాలకులు కావాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారాయన. తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండే పార్టీ టీడీపీయేనని... హైటెక్ సిటీ ముందు డ్రైనేజ్ కట్టలేదని విమర్శించిన కేటీఆర్... ప్రపంచ స్థాయి సంస్థలు రావడానికి కారణం చంద్రబాబు అని చెప్పాల్సిన పరిస్థితి తప్పలేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి విముక్తి కావాలంటే టీటీడీతోనే సాధ్యమని స్పష్టం చేశారు రమణ.