ఎల్‌ అండ్‌ టీః ఆర్డర్లు రద్దు, ఉద్యోగులపై వేటు

ఎల్‌ అండ్‌ టీః ఆర్డర్లు రద్దు, ఉద్యోగులపై వేటు

నిర్మాణ రంగ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ జూలు విదిల్చింది.  కంపెనీ లాభదాయకత పెంచుకునేందుకు నడుం బిగించింది. ఆగిన కాంట్రాక్టర్లను ఏకంగా రద్దు చేసింది. ఈ ప్రాజెక్టుల కోసం రిక్రూట్‌ చేసిన ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వ్యయాన్ని తగ్గించుకునేందుకు అనేక చర్యలు చేపట్టింది కంపెనీ. దాదాపు రెండేళ్ళుగా అతీగతీ లేకుండా పడి ఉన్న ప్రాజెక్టులకు గుడ్‌ బై చెప్పింది. భవనాలు, ఫ్యాక్టరీలు వంటి మౌలిక ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులను రద్దు చేసినట్లు కంపెనీ సీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. ఇవన్నీ నిధులు లేకపోవడం వల్ల ఆయా కంపెనీల ప్రమోటర్లు పెండింగ్‌లో ఉంచారని, ఇవి  పెద్ద భారంగా మారాయని కంపెనీ భావిస్తోంది.అందుకే వీటిని రద్దు చేసింది. మార్చితో ముగిసిన ఏడాదిలో రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను రద్దు చేసినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఇదే ఏడాదిలో 3000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరందరూ కన్‌స్ట్రక్షన్‌ వంటి సంప్రదాయిక వ్యాపార విభాగానికి చెందినవారని తెలుస్తోంది. ఐటీతో పాటు టెక్నాలజీ విభాగాల్లో మాత్రం నియామకాలను కొనసాగిస్తున్నామని కంపెనీ తెలిపింది.