ఇచ్చిన మాట తప్పం..

ఇచ్చిన మాట తప్పం..

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ . నగరంలో ఇళ్ల నిర్మాణ చాల వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. వచ్చే జూన్ నాటికి లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మిస్తామన్నారు. మొత్తం 109 ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణాలు నడుస్తున్నాయని తెలిపారు. బేగంపేటలోని మెట్రో రైల్ భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో నగర మేయర్, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో నగరంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని సమీక్షించారు కేటీఆర్. 

జీహెచ్ఎంసీ తరపున ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇదే వేగంతో ముందుకు వెళ్తే వచ్చే డిసెంబర్ నాటికి సూమారు 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం వచ్చే  ఏడాది జూన్ మాసం నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములను చేయడంతో పర్యవేక్షణ, నిర్మాణంలో వేగం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

లబ్దిదారుల ఎంపికపైనా పారదర్శక విధానాన్ని రూపొందించేందుకు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, జీహెచ్ ఎంసీ హౌసింగ్ బోర్డు అధికారులతో చర్చించాలని సూచించారు కేటీఆర్. ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో రోడ్డు, తాగునీటి సరఫరా,  పోలీస్ స్టేషన్ల వంటి మౌళిక వసతుల కల్పన కోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలని కేటీ రామారావు ఆదేశించారు.