ప్రజలకు చేరువైయ్యేందుకు.. మోదీ బాటలో కెసిఆర్

ప్రజలకు చేరువైయ్యేందుకు.. మోదీ బాటలో కెసిఆర్

అధికారంలో ఉన్న నాయకులు ప్రజలతో మమేకం అవ్వడం అంటే కొద్దిగా కష్టమైన పనే.  పరిపాలన విభాగాలతో, పధకాల రూపకల్పలనతో ప్రభుత్వాది నేతలు నిత్యం బిజీగా ఉంటారు.  వీరు డైరెక్ట్ గా ప్రజలను కలుసుకొని వారి కష్టసుఖాల గురించి తెలుసుకోవడం  కష్టంతో కూడుకొని ఉంటుంది.  అందుకోసమే.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటుంటారు.  గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి,  చంద్రబాబు నాయుడులు టెలివిజన్ ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు.  ప్రభుత్వం చేపడుతున్న పధకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించేవారు.  

ఇప్పుడు ఇదే బాటలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా నడవబోతున్నాడు.  జూన్ 2 వ తేదీకి తెలంగాణా రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతుంది.  రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడి కూడా నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది.  దీనిని పురష్కరించుకొని కెసిఆర్ మన్ కి బాత్  వంటి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారంచుట్టబోతున్నారు.  దీనికోసం ప్రగతి భవన్ లో స్టూడియో నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ స్టూడియోలో మొదట జర్నలిస్టులతో చర్చా కార్యక్రమం, అనంతరం సమస్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు కెసిఆర్ సమాధానాలు ఇస్తారు.  వారంలో ఒకరోజు ఈ కార్యక్రమం ఉంటుంది.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కెసిఆర్ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత సంతరించుకున్నది.