చాలా మంది భయపడ్డారు...

చాలా మంది భయపడ్డారు...

రైతు బంధు పథకంలో సాంకేతిక కారణాల వల్ల చెక్కులు, పాసు పుస్తకాలు అందుకోలేకపోయిన ప్రజలు బాధపడొద్దని..వారు తహసీల్దార్ కార్యాలయంలో పాస్‌బుక్కులు, చెక్కులు పొందవచ్చన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పాస్‌బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమంపై సీఎం ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరోకటి లేదని.. అందుకే వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులిస్తున్నామని.. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకతని సీఎం అన్నారు.

12 వేల కోట్లతో రైతుబంధు కార్యక్రమం అమలు చేస్తుంటే చాలా మంది భయపడ్డారని.. కానీ రైతులకు నేరుగా మేలు చేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకుపోయానని.. దేశంలో మరే ప్రభుత్వ కార్యక్రమానికి రానంత గొప్ప స్పందన రైతు బంధుకు వస్తొందని సీఎం సంతోషం వెలిబుచ్చారు. ఇంత క్లిష్టతరమైన పనిని సమర్థవంతంగా నిర్వహించిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బందులు నిజంగా అభినందనీయులని.. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పుస్తకం, చెక్కులు పంపిణీ చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.