కర్ణాటక ఎఫెక్ట్...స్థిరంగా మార్కెట్లు

కర్ణాటక ఎఫెక్ట్...స్థిరంగా మార్కెట్లు

రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. అధిక స్థాయిల వద్ద రిస్క్‌ తీసుకోవడానికి జంకుతున్నారు. దీంతో ఉదయం నుంచి కొద్దిపాటి లాభనష్టాలతో ఊగిసలాడిన సూచీలు దాదాపు క్రితం ముగింపు వద్దే ముగిశాయి. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచినా ఆయిల్‌  మార్కెటింగ్‌ కంపెనీలు పెద్దగా పెరగలేదు. దీనికి కారణం గత 19 రోజుల నుంచి ఈ కంపెనీలు భారీ భారాన్ని మోశాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుదలకు, మన కంపెనీలు పెంచిన రేట్లకు పొంతన లేదని ఇన్వెస్టర్లు అంటున్నారు. ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా మార్కెట్లు భారీగా లాభపడినా.. మిడ్‌ సెషన్‌లో మొదలైన యూరో మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి, బీఎస్‌ఈ సూచీలు దాదాపు క్రితం ముగింపుల వద్దే ముగిశాయి.

నిఫ్టి ప్రధాన షేర్లలో లాభపడిన షేర్లు ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తోపాటు పవర్‌ గ్రిడ్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో టైటాన్‌ మూడున్నర శాతం నష్టంతో అగ్రస్థానంలో ఉంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు రెండు శాతం పైగా నష్టాలతో ముగిశాయి. ఇక బీఎస్‌ఈలో  లాభాలు పొందిన షేర్లలో సన్‌ టీవీ అ్రగస్థానంలో ఉంది. ఉదయం నుంచి ఈ కంపెనీ షేర్‌ పది శాతంపైగా లాభంతో ట్రేడైంది. క్లోజింగ్‌లో కూడా ఈ షేర్‌ 11.5 శాతం లాభంతో ముగిసింది. పరాగ్‌ మిల్స్‌ పది శాతం లాభపడగా, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌ ఆరు శాతం, బేయర్‌ కార్ప్‌, గుజరాత్‌ గ్యాస్‌ 5 శాతం లాభంతో ముగిశాయి.