ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా...

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు సైతం పార్టీలో కీలక పదవి దక్కింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజును నియమించారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు ఇటీవలే రాజీనామా చేసిన విషయం   తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత నాలుగేళ్లుగా బీజేపీ అధ్యక్షులుగా హరిబాబు కొనసాగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కీలక పదవి దక్కడంపై కన్నా సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం కృషిచేస్తానని.. అమిత్‌ షా, నరేంద్ర మోదీల నమ్మకాన్ని నిలబెడతానని కన్నా అన్నారు. 2014 సాధారణ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్నా.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవలే వైసీపీలో చేరేందుకు కన్నా సిద్ధపడ్డారు. అయితే అనారోగ్య కారణాలతో వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నాను నియమించడం గమనార్హం.