అది మహానాడు కాదు మాయనాడు...!

అది మహానాడు కాదు మాయనాడు...!

తెలుగుదేశం పార్టీ మహానాడుపై సెటైర్లు వేశారు ఏపీ, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... టీడీపీది మహానాడు కాదు... మాయనాడు అంటూ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ఏం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉందన్న కన్నా... ఇప్పడున్నది ఎన్టీఆర్‌ స్థాపించిన నిజమైన టీడీపీ కాదని, మోసపూరిత టీడీపీ అన్నారు. ఎన్టీఆర్ బ్రతికుండగా ఆయన ఆత్మక్షోభ పెట్టి, ఆయనపై చెప్పులేయించి, ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారని ఆరోపించిన ఏపీ బీజేపీ చీఫ్... కాంగ్రెస్ ఏజెంటుగా మారి, మామా ఎన్టీఆర్‌ పక్కన చేరి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 

కాంగ్రెస్  పార్టీకి చంద్రబాబు అద్దె మైకుగా తయారంటూ ఆరోపించారు కన్నా లక్ష్మీనారాయణ... కర్ణాటకలో చంద్రబాబు... బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పినా మంచి సీట్లు సాధించామన్నారు. టీడీపీ ప్రచారం చెయ్యబట్టే కర్ణాటకలో కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదంటూ సెటైర్లు వేశారు. ఇక విభజన చట్టంలో ఉన్నవన్నీ ఖచ్చితంగా పూర్తిచేస్తామిన ధీమా వ్యక్తం చేశారు కన్నా... ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాధించామంటూ స్వీట్లు పంచారని, వెంకయ్యనాయుడుని ఊరూరా తిప్పి సన్మానం చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన... కేవలం చంద్రబాబు అసమర్ధత వల్లే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదంటూ ఎద్దేవా చేసిన కన్నా... రాష్ట్రంలో ఒకపక్క అవినీతి, మరోపక్క ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగం జరుగుతోందన్నారు. రాజధాని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించి... వారి భూములను చంద్రబాబు రియల్ ఎస్టేట్ కు అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.