సహజనటి జయసుధ బర్త్ డే స్పెషల్

సహజనటి జయసుధ బర్త్ డే స్పెషల్

సహజ నటి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే జయసుధ. పాత్రలకు జీవం పోసి స్టార్‌ హీరోలకు దీటుగా రాణించిన జయసుధ పుట్టినరోజు నేడు (శనివారం). ఈ సందర్భంగా జయసుధ సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. దాదాపు 44 ఏళ్ళగా వెండి తెరపై తిరుగులేని నటిగా ప్రేక్షకులను మెప్పించిన జయసుధ 1958, డిసెంబర్‌ 17న మద్రాసులో జన్మించింది. అంటే తమిళ వారనుకోకండి తెలుగువారే. జయసుధ అసలు పేరు సుజాత. టీచర్‌  కావాలనుకున్న జయసుధను సినిమా రంగం విజయనిర్మల రూపంలో ఆహ్వానిచ్చింది. ఆమెకు విజయ నిర్మల స్వయానా  మేనత్త. ఆమెను చూసి సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్న సుజాత విజయనిర్మలతోపాటు రెగ్యులర్‌గా షూటింగ్‌లకు వెళ్లేవారు. అయితే సినిమాల్లోకి వెళ్లడం జయసుధ నాన్నకు ఇష్టం లేదు. సినిమా రంగం అమ్మాయిలకు మంచిది కాదని, తప్పుదారి పడతారని ఆయన వాదించేవారు. కాని వాళ్ళ నాన్నమ్మ ప్రోత్సాహంతో, విజయ నిర్మల సహకారంతో తల్లిదండ్రులను ఒప్పించి ఎట్టకేలకు 1972లో 'పండంటి కాపురం' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇందులో అలనాటి నటి జమునకు కూతురిగా నటించారు. 
అలా మొదటి చిత్రంతో ఆకట్టుకున్న జయసుధ రెండవ సినిమాకు కె.బాలచందర్‌ దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశాన్ని దక్కించు కున్నారు. ఆయన తెరకెక్కించిన 'అరంగేట్రం', 'అపూర్వ రాగంగళ్‌' చిత్రాల్లో నటించారు. ఆమె తొలి హిట్‌ 'అపూర్వ రాగంగళ్‌'. ఇక కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతి' చిత్రంతో టాలీవుడ్‌లో తొలి బ్రేక్‌ అందుకున్నారు. అప్పటికి జయసుధ వయసు హీరోయిన్‌గా పీక్‌ టైమ్‌లో ఉన్నప్పుడు ఆమె నటించిన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళానికి చెందిన 24 సినిమాలు ఒకే ఏడాదిలో విడుదలవ్వడం అప్పట్లో ఓ సెన్సేషనల్‌ రికార్డ్‌. 'చిన్నా', 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'బాలు', 'బొమ్మరిల్లు', 'కొత్తబంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎవడు' వంటి చిత్రాలతో అమ్మ పాత్రలకు కేరాఫ్‌ అయ్యారు. అలాగే విభిన్న పాత్రల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ శక్తివంతమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.