పాపం... కోటీశ్వరి..

పాపం... కోటీశ్వరి..

 

లాటరీలో కోట్లు గెలుచుకోవడం ఎంతో సంతోషం కలిగించవచ్చు. రాత్రికి రాత్రే కోటీశ్వరుల జాబితాలో చేరడం అంటే మాటలా మరి. కానీ దాంతో పాటే ఎన్నో కష్టాలూ వచ్చి పడతాయి. అప్పటిదాకా ఈసడించుకున్నవాళ్లు కూడా ఈర్ష్య పడతారు. అవకాశం దొరికితే ఆ కోట్లని కొట్టేయాలని చూస్తారు. ఇదే భయం పట్టుకుందో జమైకా మహిళకు. లాటరీలో జాక్ పాట్ తగిలి ఏకంగా 180 మిలియన్ జమైకన్ డాలర్లు గెలుచుకుంది. ఆ డబ్బు దోచేస్తారనే ఆందోళనతో తననెవరూ గుర్తు పట్టకూడదని ఆమె చేసిన పని ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండవుతోంది.

ఎన్ గ్రే అనే జమైకన్ మహిళ మే 11న జరిగిన సూపర్ లొట్టో జాక్ పాట్ లో మిలియన్ అమెరికన్ డాలర్లు గెలుచుకుంది. స్థానిక కరెన్సీలో చూస్తే ఇది 180 మిలియన్ జమైకన్ డాలర్లు. అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన గ్రే, ఇంత పెద్ద మొత్తం గెలవడంతో సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబయింది. అయితే వెంటనే ఎవరైనా గుర్తు పడితేనో అనే అనుమానం వచ్చి కంగారు పడింది. వెంటనే ఇందుకో ఉపాయం కూడా వెదికింది. 

సాధారణంగా మనం చాటింగ్ లో వాడే వింక్ వింక్ ఎమోజీ మాస్క్ ముఖానికి తగిలించుకుని వచ్చి లాటరీ నిర్వాహకుల నుంచి తన చెక్ తీసుకుంది. ఈ ఫోటోని లాటరీ నిర్వహణ సంస్థ సుప్రీమ్ వెంచర్స్ లిమిటెడ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగానే వైరల్ గా మారింది. ఏకంగా 3000 లైక్ లు కొట్టారు. ఇక రీట్వీట్ల సంగతి సరేసరి. 

ఈ డబ్బుతో ఏం చేస్తావని గ్రేని అడిగితే అప్పులు తీర్చి కొంత మొత్తం పెట్టుబడి పెడతానని.. మరికొంత మొత్తంతో ట్రావెలింగ్ చేస్తానని చెప్పింది. మొత్తం తన సొంతానికే వాడేసుకోకుండా కొంత తనుండే ప్రాంతంలోని యువత కోసం కమ్యూనిటీ సెంటర్ కట్టించి అందులో వారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పిస్తానని తెలిపింది.