అణు ఒప్పందానికి అమెరికా గుడ్‌బై

అణు ఒప్పందానికి అమెరికా గుడ్‌బై

 అనుకున్నట్టే జరిగింది. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకుంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసుకున్న ఈ ఒప్పందానికి ట్రంప్‌ గుడ్‌బై చెప్పారు. ఈమేరకు కీలక ప్రకటన చేశారు. 2015 ఒప్పందంలో ఎత్తివేసిన ఆంక్షలన్నీ ఇరాన్‌పై తిరిగి విధిస్తామన్నారు. నిర్మాణాత్మక ఒప్పందం కుదిరి ఉండాల్సిందని, కానీ అలా జరగలేదని అన్నారు. సిరియా సహా అనేక చోట్ల ఇరాన్ విధ్వంసాలకు పాల్పడిందని గుర్తుచేశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం దౌత్య సంబంధాలను ఏ విధంగానూ మెరుగుపరచలేదని, అణు ఆయుధాల కోసం ఇరాన్ అన్వేషణను కూడా నిలువరించలేదని ట్రంప్‌ చెప్పారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని కాలదన్ని ఇరాన్‌కు ఏ దేశమైనా సహకారం అందిస్తే తమ  ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ ఒప్పందం మూడేళ్ల క్రితం ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగింది. ఒప్పందం తర్వాత ఇరాన్.. అణు కార్యక్రమాన్ని నిలిపివేసింది. దానికి ప్రతిస్పందనగా, ఇరాన్‌పై అమలవుతున్న ఆర్థిక ఆంక్షలను అమెరికా సడలించింది.