ఇంతకీ...ఈ ఐఎన్ఎక్స్‌ స్కామ్‌ ఏమిటి?

ఇంతకీ...ఈ ఐఎన్ఎక్స్‌ స్కామ్‌ ఏమిటి?

మొన్నటి దాకా ఇంద్రాణి ముఖర్జియా, పీటర్‌ ముఖర్జీలకు పరిమితమైన ఐఎన్ఎక్స్‌ కంపెనీ వ్యవహారాలు ఇపుడు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అత్యంత వివాదాస్పద మీడియా కంపెనీ అయిన ఐఎన్‌ఎక్స్‌ పెట్టుబడుల్లో పెద్ద తలకాయల పాత్ర ఉండటంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విచిత్రంగా ఈ కేసులో కొన్ని పెద్ద కార్పొరేట్‌ సంస్థల పాత్ర ఉన్నా.. వాటిని కాదని ఎఫ్‌ఐపీబీని ముందుకు తెచ్చింది సీబీఐ. చిదంబరాన్ని ముగ్గులోకి లాగుతోంది. ఈ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అరెస్టు నుంచి తాత్కాలికంగా తప్పించుకోగలిగారు కాని, ఈ నెల 6 (బుధవారం)న సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసు వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. 2007లోఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఆమోదం ఇవ్వడంలో ఆయన పాత్రపై సీబీఐ చిదంబరాన్ని ప్రశ్నించనుంది. చిదంబరం తన కుమారుడు కార్తి చిదంబరానికి మేలు చేయడానికి అధికార దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

 • ఐఎన్ఎక్స్ మీడియా సంస్థను 2007లో మాజీ మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ప్రారంభించారు. 
 • ఈ సంస్థలోకి నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది. 
 • విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ఆమోదం మంజూరు చేయడంలో కార్తీ చిదంబరం హస్తం ఉందని గుర్తించిన సీబీఐ పదేళ్ళ తర్వాత ఆయనపై కేసును నమోదు చేసింది. 
 • ఐఎన్ఎక్స్ మీడియాలోకి విదేశీ పెట్టుబడుల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కేసులు నమోదయ్యాయి. 
 • ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్లు వచ్చాయని సీబీఐ గుర్తించింది. అప్పటికే మే 2007లో విదేశీ పరోక్ష పెట్టుబడులుగా రూ. 4.62 కోట్లు మాత్రమే నిధులు సేకరించేందుకు ఎఫ్‌ఐపీబీ అనుమతి ఇచ్చింది. కాని ఐఎన్ఎక్స్ కంపెనీ ఏకంగా రూ.305 కోట్లను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా తెచ్చుకొంది.
 • ఈ వ్యవహారంలో ఫిర్యాదు అందుకొన్న ఆదాయపన్ను శాఖ దర్యాప్తు బృందం ఎఫ్ఐపీబీ నుంచి వివరణ తీసుకొంది. 
 • డొంక కదులుతోందని గుర్తించిన ఐఎన్ఎక్స్ సంస్థ ప్రతినిధులు..ఐటీ శాఖ కఠిన శిక్షల నుంచి బయట పడేందుకు  కార్తీని కలిశారు.
 • ఎఫ్ఐపీబీలోని అధికారులను ప్రభావితం చేసి సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని వారు కార్తీని కోరినట్లు సీబీఐ అంటోంది.
 • 2007లో కార్తీ చిదంబరం తమ దగ్గర రూ.3 కోట్లు తీసుకొని, ఆ డబ్బును తన కంపెనీలోకి అక్రమ మార్గంలో మళ్లించుకున్నాడని పీటర్, ఇంద్రాణి సీబీఐకి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. 
 • ఇది కాకుండా కార్తీ కన్సల్టింగ్ ఫీజుగా రూ.10 లక్షలు ఐఎన్ఎక్స్ యాజమాన్యం నుంచి తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. అడ్వాంటేజీ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఈ మొత్తం తీసుకొన్నాడని సీబీఐ ఆరోపణ. 
 • కార్తీ తన తండ్రి నేతృత్వంలోని ఎఫ్ఐపీబీని, దాని అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేశారని సీబీఐ ఆరోపించింది. అప్పుడే కొందరు అధికారులు మరోసారి విదేశీ పెట్టుబడులు తెచ్చుకొనేందుకు * దరఖాస్తు చేసుకొమ్మని సలహా ఇచ్చారు. 
 • ఆ సలహా ప్రకారమే ఐఎన్ఎక్స్ కొత్తగా అనుమతికి దరఖాస్తు చేసుకొని ఎఫ్ఐపీబీ ఆమోదం కూడా పొందగలిగింది. 
 • ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న రెవెన్యూ శాఖ ఆదేశాన్ని అధికారులు పెడచెవిన పెట్టారు. 
 • వీటన్నిటిపై దర్యాప్తు జరిపిన సీబీఐ 2017 మేలో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. 
 • 2018 ఫిబ్రవరి 28న ఆయనను అరెస్ట్ చేసింది. అయితే కార్తీ బెయిల్ పై విడుదలై బయటికొచ్చారు. 
 • సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో చిదంబరం పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఆర్థిక మంత్రి అయిన తన తండ్రి హోదా, పలుకుబడిని కార్తీ ఉపయోగించాడని పేర్కొంది. 
 • ఇప్పుడు ఏకంగా చిదంబరాన్నే టార్గెట్ చేసింది సీబీఐ. అయితే చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్‌ చేయకుండా ఢిల్లీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి తాత్కాలిక రక్షణ కల్పించింది. 
 • జులై 3 వరకు ఆయనను అరెస్ట్‌ చేయొద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది. సీబీఐ ప్రశ్నించడానికి పిలిచినప్పుడు వెళ్లాలని చిదంబరానికి సూచించింది.