నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం... అసలు ఎలా పుట్టింది..?

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం... అసలు ఎలా పుట్టింది..?

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం... ప్రత్యేకంగా మహిళలు సెలబ్రేట్ చేసుకునే రోజు... మన నేతలు వేదికలు ఎక్కి... మహిళల గురించి గొప్పలు చెప్పేరోజు... అసలు ఇంతకీ ఈ ఉమెన్స్ డే ఎప్పుడు పుట్టింది? ఎలా స్టార్ట్ అయింది..? అంటే.. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు.. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోంది. ఆడవారి కష్టానికి గుర్తింపుగా మార్చి 8న ఇంటర్నేషనల్‌‌ ఉమెన్స్‌‌ డే చేసుకుంటున్నారు. అంతేకాదు జెండర్‌‌ ఈక్వాలిటీ ప్రచారమే ఉమెన్స్‌‌ డే లక్ష్యం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908 సంవత్సరంలో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అంతేకాదు..1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం - శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2  సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా  దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ  శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది. వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. కుటుంబ, ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోంది. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది. మేం ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతా సాధిస్తున్న ఇంకా అణచివేతకు గురవుతూనే ఉన్నారు. దీని నుంచి వారిని రక్షించాలంటే చట్టాలు మరింత కఠినతరం చేయడంతో పాటు ఆలోచిన విధానంలో మార్పులు రావాల్సి ఉంది. ఆర్ట్స్, లిటరెచర్, సినిమాలు మహిళలను ప్రముఖ్యాన్ని పెంచెవిగా ఉండాలి. అప్పుడే మహిళా సాధికారికత సాధ్యమవుతుంది.