భారీ నష్టాల్లో ప్రపంచ షేర్‌ మార్కెట్లు

భారీ నష్టాల్లో ప్రపంచ షేర్‌ మార్కెట్లు

ఇటలీ సంక్షోభానికి చైనా అమెరికా వాణిజ్య యుద్ధం తోడవడంతో షేర్‌ మార్కెట్‌లో కలకలం రేగింది. సోమవారం సెలవు తరవాత నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇటలీలో మళ్ళీ ఎన్నికలు తప్పదని వార్తలు రావడంతో యూరో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. రెండు రోజుల్లోనే  కొన్ని దేశాల సూచీలు అయిదుశాతం దాకా క్షీణించాయి. డాక్స్‌తో సహా పలు యూరో  దేశాల సూచీలు ఒకటి నుంచి రెండు శాతం దాకా క్షీణించాయి. రాత్రి అమెరికా మార్కెట్లు కూడా ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు క్షీణించాయి. నాస్‌డాక్‌ మాత్రం అరశాతం నష్టంతో సరిపెట్టుకుంది. చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. చైనాతోపాటు జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ వంటి కీలక సూచీలు  ఒకటిన్నర శాతం క్షీణించాయి. ముడి చమురు ధరలు తగ్గినా... పతనం ఆశించిన స్థాయిలో లేదు. యూరో కరెన్సీలు బక్కచిక్కడంతో డాలర్‌ మరింత బలపడుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 95కు చేరువౌతోంది. భారత మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభం కానున్నాయి.