విదేశీ విమాన‌ స‌ర్వీసుల‌పై క్లారిటీ.. మొద‌ట‌గా ఈ దేశాల‌కే...

విదేశీ విమాన‌ స‌ర్వీసుల‌పై క్లారిటీ.. మొద‌ట‌గా ఈ దేశాల‌కే...

క‌రోనావైర‌స్ క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్ విధించ‌డంతో దేశీయ‌, విదేశీ విమాన స‌ర్వీలు నిలిపివేశారు.. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు కొన్ని విమానాలు ప్ర‌భుత్వం వాడుకొంది.. ఇక‌, లాక్‌డౌన్ స‌డ‌లింపులు వ‌చ్చిన త‌ర్వాత‌.. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న‌వారి కోసం ప్ర‌త్యేకంగా విమానాలు న‌డిపారు.. దేశీయంగా విమానాలు తిరుగుతున్నాయి.. కానీ, అన్‌లాక్‌లోకి అడుగుపెట్టినా.. విదేశీ విమానా స‌ర్వీసుల‌కు మాత్రం గ్రీన్‌సిగ్న‌ల్ ల‌భించ‌లేదు.. ఇవాళ మొత్తానికి విదేశీ విమానాల‌కు సైతం ప‌చ్చ‌జెండా ఊపింది కేంద్ర ప్ర‌భుత్వం.. రేపటి నుంచి విదేశీ విమాన స‌ర్వీసులు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి.. విమాన సర్వీసులు నడిపేందుకు మూడు దేశాల‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయ‌న్న ఆయ‌న‌.. మొదటగా అమెరికా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ దేశాలకు స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. 

రేప‌టి నుంచి అమెరికా, ఎల్లుండి నుంచి ఫ్రాన్స్.... భార‌త్‌కు విమాన స‌ర్వీసులు న‌డిపేందుకు అంగీక‌రించాయ‌న్న కేంద్రమంత్రి... జులై 18 నుంచి ఆగ‌స్టు 1 వ‌ర‌కు పారిస్ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు మ‌ధ్య 28 విమానాల‌ను ఎయిర్ ఫ్రాన్స్ న‌డుపుతుంద‌ని.. రేపటి నుంచి నుంచి జులై 31 వ‌ర‌కు భార‌త్ – అమెరికా మ‌ధ్య‌ 18 యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల‌ను న‌డిపేందుకు ఒప్పందం కుదిరింద‌న్నారు. ఇక‌, యూకే, జర్మ‌నీతో కూడా విమాన స‌ర్వీసుల‌పై సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో కూడా ఒప్పందం ఓ కొలిక్కి వ‌చ్చింద‌ని.. విదేశీ విమాన స‌ర్వీసుల‌పై ఈ నిర్ణ‌యాన్ని ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్పులు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని వెల్ల‌డించారు హార్దిప్ సింగ్ పూరి.