జనగామ టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు

జనగామ టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు

  జనగామ జిల్లాలోని అధికార పార్టీలో కొత్త రగడ రాజుకుందా? జడ్పీ వేదికగా రాజకీయం వేడెక్కుతోందా? ఆధిపత్య పోరుకు నాయకులు తెరతీశారా? టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? 

జనగామ జడ్పీ టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాగం!

జనగామ జిల్లా పరిషత్‌లో విపక్షం లేదు. ఉన్నదంతా అధికార పక్షమే. విపక్షం లేదని బోరుకొట్టిందో ఏమో కానీ... స్వపక్షంలోనే విపక్షంలా మారిపోయింది అక్కడి TRS పరిస్థితి. జడ్పీలో నేతల మధ్య అసమ్మతి రాగం తారాస్థాయికి చేరింది. దీనికి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వేదికగా మారడం పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తం 12 మంది జడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌కు చెందినవారే. అయినా ఈ మధ్య జరిగిన సమావేశానికి కేవలం ముగ్గురే జడ్పీటీసీలు హాజరయ్యారు. జడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి మీద ఉన్న అసమ్మతితో మిగతావాళ్లు సమావేశానికి రాలేదని సమాచారం. 

జడ్పీ చైర్మన్‌, జడ్పీటీసీల మధ్య సఖ్యత లేదా?

జడ్పీ చైర్మన్‌కు, జడ్పీటీసీల  మధ్య సఖ్యత లేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. గెలిచిన కొద్దిరోజులకే వీళ్ల మధ్య విభేదాలు వచ్చాయట. జడ్పీ చైర్మన్‌ అందరినీ కలుపుకొని వెళ్లకపోవడమే ఈ సమస్యకు కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. బడ్జెట్‌ కేటాయింపుల కింద ఇచ్చే పనుల్లో సైతం చైర్మన్‌ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారట.  కొందరికి 5 లక్షలు చొప్పు, మరికొందరికి 3 లక్షల చొప్పున పనులు కేటాయించారనే విమర్శ ఉంది. కటాఫ్‌ డేట్లు పెట్టి గడువు నెత్తిమీదకు వచ్చికన తర్వాత చెప్పడంతో నిధులను జడ్పీటీసీలు తిరస్కరించినట్లు సమాచారం. తమ పరిధిలో జరిగే బదిలీల గురించి సమాచారం ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్నారట. 

పార్టీ పెద్దలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా? 

ఈ కారణాల వల్లే జడ్పీ మీటింగ్‌కు మిగతా వాళ్లు రాలేదని.. వాళ్లంతా లోకల్‌గానే ఉన్నా డుమ్మా కొట్టారని చెబుతున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరైనా అంతా మొక్కుబడిగా సాగిపోయింది. అయితే విభేదాలు తెలిసినా చొరవ తీసుకుని పరిష్కరించాల్సిన పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సమావేశానికి రాలేదు సరికదా.. తప్పించుకుని తిరుగుతున్నారన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

కరోనా అని చెబుతున్నా.. కారణం అది కాదా?

జడ్పీ చైర్మన్‌ అనుచరులు మాత్రం.. పార్టీలోని కొందరు పెద్దల అండ చూసుకునే జడ్పీటీసీలు ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. మరి.. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీలు బోడకుంట్ల వెంకటేశ్వర్లు, పళ్లా రాజేశ్వర్‌రెడ్డి రాకపోవడానికి  కారణం.. కరోనా అని పైకి చెబుతున్నా.. అది అసలు కారణం కాదన్నది అందరూ అనుకునే మాట. మరి.. ఈ అసమ్మతి రాగం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.