పెరగనున్న ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు

పెరగనున్న ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు

అచ్ఛే దిన్‌ ఎలా ఉంటాయో ఇంకా జనానికి తెలియకముందే.... బురే దిన్‌ మొదలయ్యాయి. గత నాలుగేళ్ళుగా తగ్గుతూ వచ్చిన వడ్డీ రేట్లు ఇపుడు పెరగడం ప్రారంభించాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. తాజా పెంపుతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. బ్యాంకులు సాధారణంగా ఆర్‌బీఐ నుంచి రుణాలు తీసుకుంటుంటాయి. వీటిపై ఆర్‌బీఐ ఇప్పటి వరకు ఆరు శాతం వడ్డీ వసూలు చేసేది. ఇపుడు దీన్ని 6.25 శాతానికి (రెపో రేటు) పెంచారు. దీంతో బ్యాంకులు ఈ భారాన్ని తమ ఖాతాదారులపై మోపుతాయి. ఆర్థికవృద్ధి పరవాలేదనుకుంటున్న సమయంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో... పరోక్షంగా దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో వాస్తవ వడ్డీ రేట్లు పెరగకుండా ఉండేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. దీంతో బ్యాంకులు ఇచ్చే అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఆర్బీఐ నుంచే గాక... జనం నుంచి కూడా బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తాయి. దీనిపై కూడా ఇటీవల ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకులు వడ్డీని పెంచాయి. పరోక్షంగా రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయని మార్కెట్‌కు హెచ్చరికలు పంపాయి.
ఇప్పటికే పెంచాయి
హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పటికే రుణాలపై వడ్డీ రేటును పెంచింది. జూన్‌ 1 నుంచి అమలయ్యే విధంగా వడ్డీ రేట్లను సవరించింది. పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా వడ్డీ రేట్లను పెంచాయి.