నేటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్‌ టెస్టు

నేటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్‌ టెస్టు

ప్రపంచ క్రికెట్‌ లో తొలిసారిగా అఫ్గానిస్తాన్‌ జట్టు నేడు టెస్ట్ క్రికెట్ ఆడబోతుంది. దీంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఏకైక టెస్టులో భారత్‌తో అఫ్గానిస్తాన్‌ జట్టు తలపడుతుంది. తాజాగా ఐసీసీ అఫ్గానిస్తాన్‌ జట్టుకు టెస్టు హోదా ఇచ్చింది. గాయం కారణంగా రెగులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ కి దూరం అవడంతో అజింక్య రహానే టీమిండియాకు సారధిగా వ్యవహరిస్తున్నాడు.

టెస్టుల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ముగ్గురు ఓపెనర్లు ధావన్, విజయ్, రాహుల్‌ అందుబాటులో ఉన్నారు. అయితే బుధవారం ప్రాక్టీస్‌ సెషన్‌ నుంచి ధవన్‌ అర్థంతరంగా వెళ్లిపోవడంతో అతనికి గాయం అయిందని సమాచారం. ఈ క్రమంలో ఓపెనర్లుగా విజయ్, రాహుల్‌ బరిలోకి దిగడం ఖాయం. కరుణ్‌ నాయర్‌ మిడిలార్దర్‌లో రానున్నాడు. కెప్టెన్ కోహ్లి గైర్హాజరుతో మిడిలార్డర్‌లో నాయర్‌కు చోటు దక్కనుంది. రెగ్యులర్ కీపర్ సాహా కూడా గాయంతో వైదొలగడంతో.. చాలా ఏళ్ల విరామం తర్వాత దినేశ్‌ కార్తీక్‌ టెస్టులోకి బరిలోకి దిగనున్నాడు. ఇక యువ హార్దిక్‌ పాండ్యాకి ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు ఖాయం. ఇద్దరు పేసర్లుగా ఉమేశ్, ఇషాంత్‌లు బంతిని పంచుకోనున్నారు. మూడో పేసర్ ను తీసుకునే అవకాశం ఉంటె నవ్‌దీప్‌ సైనికి అరంగేట్ర ఛాన్స్ వస్తుంది. సీనియర్లు అశ్విన్, జడేజాలు స్పిన్ బారంను మోయనున్నారు.

అత్యంత పటిష్టమైన భారత బ్యాటింగ్‌ను తొలి టెస్ట్ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ జట్టు ఎలా నిలువరిస్తుందన్నదే అతిపెద్ద విషయం. అయితే టీ-20ల్లో మాదిరి కేవలం 4 ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడం అంత సులువు కాదు. టెస్టు క్రికెట్‌లో ఓపిక, పట్టుదల అవసరం.. అఫ్గానిస్తాన్‌ జట్టులో ఎవరికీ అంతగా అనుభవం లేదు. అయితే సంచలన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు భారత పిచ్ లపై ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టమైన భారత బ్యాటింగ్‌ను రషీద్‌ నిలువరిస్తాడని అఫ్గాన్‌ బోలెడు ఆశలు పెట్టుకుంది. రషీద్ కి తోడుగా ఆల్‌రౌండర్‌ నబీ మాత్రమే ఉన్నాడు. అయితే అఫ్గానిస్తాన్‌ జట్టు ప్రధాన బలహీనత బ్యాటింగ్‌.. ఎవరు కూడా చెప్పుకోదగ్గ బ్యాట్స్ మెన్ లేకపోవడంతో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవనుంది.