ఆ "ఇద్దరి" ఓటు ఎవరికీ..?

ఆ "ఇద్దరి" ఓటు ఎవరికీ..?

ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ కన్నడ నాట హంగ్ ఏర్పడిండి. కౌంటింగ్ ప్రారంభైన తొలి రెండు గంటలు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్‌లు గట్టి పోటీ ఇవ్వడంతో బీజేపీ మేజిక్ ఫిగర్‌కు రెండు అడుగుల దూరంలో నిలబడింది. ఈ నేపథ్యంలో తాను ప్రభుత్వాన్ని ఏర్పరచపోయినా పర్లేదు కానీ.. కమలనాథులకు మాత్రం ఆ ఛాన్స్ దక్కకూడదని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఉదయం నుంచే జేడీఎస్‌ నేతలతో టచ్‌లో ఉంటూ.. సీఎం పదవిని ఆఫర్ చేసి.. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేద్దామని కోరారు. వీరి ప్రతిపాదన నచ్చడంతో దీనికి అంగీకారం తెలిపింది జేడీఎస్.

అయితే తృటిలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ.. తన కల నేరవేర్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి కొద్దిమందిని కమలం వైపు లాగేందుకు పావులు కదుపుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనను కలిసిన యడ్యూరప్పను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరారని.. అయితే అసెంబ్లీలో బలనిరూపణకు వారం రోజులు గడువు ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు స్వతంత్రుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

జేడీఎస్‌తో పాటు వీరిద్దరూ కూడా ఇప్పుడు కీలకంగా మారారు.. దీంతో వారితో ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు బేరసారాలు ప్రారంభించాయని వినికిడి.. అసలు ఇంతటి ముక్కోణపు పోటీలో గెలిచిన వారిద్దరూ ఎవరంటే.. ముల్‌బాగల్ నియోజకవర్గం నుంచి స్వతంత్రుడిగా గెలిచిన హెచ్ నగేశ్, రాణేబెన్నూర్ నుంచి ఆర్ శంకర్. వీరిని తమ క్యాంప్‌లోకి లాగేందుకు బీజేపీ పెద్దలు రాయబారాలు నడుపుతున్నప్పటికీ.. వీరిద్దరూ తమ మద్ధతును కాంగ్రెస్‌కే తెలపడం విశేషం.