ఫర్నీచర్‌ రంగ రారాజు... ఐకియా రెడీ

ఫర్నీచర్‌ రంగ రారాజు... ఐకియా రెడీ

వైవిధ్యమైన ఫర్నిచర్ ఉత్పత్తులకు స్వీడన్ కు చెందిన హోమ్ ఫర్నిషింగ్ సంస్థ ఐకియా పెట్టింది పేరు. ఫర్నిచర్‌ వ్యాపారంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ దిగ్గజ సంస్థ.. ఐకియా, భారత్ లో తన మొట్టమొదటి స్టోర్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది. ఈ హోం ఫర్నిచర్ దిగ్గజం దేశంలో తన తొలి స్టోర్ ను జూలై 10న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఐకియా 2016 ఆగస్టులో తన భారీ స్టోర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. హైటెక్ సిటీకి సమీపంలో రూ.800 కోట్ల పెట్టుబడితో 13 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భారీ స్టోర్‌ నిర్మిస్తోంది. ఇప్పటికే స్టోర్‌ ముందు భారీ ఐకియా బోర్డు, సమీపాన నావిగేషన్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. దీంతో చుట్టుపక్కల ప్రజలందరి దృష్టి ఐకియా స్టోర్‌పై పడింది.  

ఈ స్టోర్‌లో 1,000 సీట్ల సామర్థ్యం కలిగిన రెస్టారెంట్‌ కూడా ఏర్పాటు చేస్తోంది ఐకియా. ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా ఉన్న ఐకియా స్టోర్లలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న రెస్టారెంటే పెద్దది కావడం విశేషం. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఐకియా స్టోర్ లో పనిచేసేందుకు సుమారు 800 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. 50% మహిళా ఉద్యోగులను నియమించనున్నారు. 

హైదరాబాద్ లో తమ ఉత్పత్తుల ప్రదర్శనకు ఐకియా ఇప్పటికే ఐకియా హే స్టోర్స్ పేరిట ఒక స్టోర్ ప్రారంభించింది. కస్టమర్లకు తమ ఉత్పత్తులు పరిచయం చేయడంతో పాటు వారికి ప్రత్యక్షంగా అనుభవం అందుబాటులోకి తెచ్చేందుకు సుజనా ఫోరమ్ మాల్ లో ఈ స్టోర్ ఏర్పాటు చేసింది ఐకియా సంస్థ. ఈ స్టోర్ లో ఇంటికి సంబంధించిన ఫర్నిచర్, వంట సామాగ్రి, గృహాలంకరణ వస్తువులు, అల్మారాలు, మంచాలు, పరుపులు.. వగైరా ఉత్పత్తులన్నీ దొరుకుతున్నాయి. 

ఐకియా స్టోర్ లో 8 వేలకు పైగా ఉత్పత్తులు ప్రదర్శనకు ఉన్నాయి. ఇందులో లైఫ్ ఎట్ హోమ్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాదీల అభిరుచులకు తగ్గట్టుగా బెడ్రూమ్, కిచెన్, డైనింగ్, పిల్లల ప్లే ఏరియా వంటివి ఎలా తీర్చుదిద్దుకోవాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. 

తమ బడ్జెట్ అనుసరించి కొనుగోలు చేసేందుకు వీలుగా భిన్నమైన ధరల శ్రేణిని నిర్ణయించింది. 2 వేలకి పైగా ఉత్పత్తుల ధరలు 200 రూపాయల కన్నా తక్కువగా ఉంచి అందరికీ అందుబాటు ధరల్లో అనే పదానికి అసలైన అర్థం చెప్పింది ఐకియా. ఐకియా రంగ ప్రవేశం తర్వాత ఫర్నీచర్‌ మార్కెట్ లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. 

2019లో ముంబయిలో రెండో స్టోర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఐకియా అధికారులు తెలిపారు. తర్వాత బెంగళూరు, ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారు. ఐకియా పూణెలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించనుంది. కంపెనీ 2025 నాటికి రూ.10,500 కోట్ల పెట్టుబడితో దేశంలో 25 స్టోర్లు ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఐకియా స్టోర్లన్నటినీ డిజిటల్ గా కనెక్ట్ చేస్తారు. దీనివల్ల వినియోగ దారులు తమ ఫోన్లోనే ఉత్పత్తులు చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు.