కొచ్చర్‌పై 'అమెరికా నిఘా'

కొచ్చర్‌పై 'అమెరికా నిఘా'

కొద్దికాలంగా వివాదాల ఊబిలో చిక్కుకున్న ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో చందా కొచ్చర్‌ కష్టాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొచ్చర్‌తోపాటు ఆమె నేతృత్వం వహిస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కష్టాల కారుమబ్బులు కమ్ముకొనేలా ఉన్నాయి. చందా కొచ్చర్ వ్యవహారాలపై అమెరికా ఏజెన్సీలు నిఘా పెట్టాయి. కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల అవినీతిపై ఇప్పటికే భారత్ లో జరుగుతున్న దర్యాప్తుకు తోడు అమెరికా మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్  కమిషన్ (ఎస్ఈసీ) కూడా విచారణ జరపాలని నిర్ణయించింది. దీంతో త్వరలోనే కొచ్చర్, ఐసిఐసిఐ బ్యాంకు ఎస్ఈసీ విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చని భావిస్తున్నారు.


బ్యాంకు ప్రయోజనాలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకోగా కొచ్చర్ తమ కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చేలా వ్యవహరించడంపై ఐసీఐసీఐ బ్యాంకు స్వతంత్ర దర్యాప్తు జరుపుతోంది. మొదట కొచ్చర్ పై సంపూర్ణ విశ్వాసం ప్రకటించిన బ్యాంకు బోర్డు.. విజిల్ బ్లోయర్ అరవింద్ గుప్తా కొత్త ఆరోపణలతో స్వతంత్ర విచారణ చేపట్టింది. ఇక భారత మార్కెట్ రెగ్యులేటర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇప్పటికే కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంకులకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అంతే కాకుండా ఈ వ్యవహారాన్ని ఆర్బీఐ, కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖ కూడా పరిశీలిస్తున్నాయి. మార్చిలో సీబీఐ కొచ్చర్ భర్త దీపర్ కొచ్చర్ పై ప్రాథమిక విచారణ నమోదు చేసింది. ఏప్రిల్ లో ఆమె మరిది రాజీవ్ కొచ్చర్ ను లోతుగా ప్రశ్నించింది సీబీఐ. చందా కొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంకుల వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్న భారతీయ దర్యాప్తు సంస్థలు మారిషస్ తో సహా అనేక విదేశీ విచారణ సంస్థల సహకారం కోరాయి.


అయితే అమెరికా మార్కెట్ల లో ఐసీఐసీఐ బ్యాంకు లిస్ట్ కావడంతో అక్కడి మార్కెట్ రెగ్యులేటర్ ఎస్ఈసీ కూడా కొచ్చర్ వివాదంపై దృష్టి సారించింది. త్వరలోనే ఈ వివాదంపై సెబీని మరింత వివరణ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  అయితే ఇప్పటి వరకు ఎస్ఈసీ అధికారులు మాత్రం కొచ్చర్, ఐసీఐసీఐకి సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.
2012లో రూ. 3,250కోట్ల రుణం విషయంలో వీడియోకాన్‌ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా క్విడ్ ప్రోకోగా చందా కొచ్చర్‌ సాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌, మరో ఇద్దరు బంధువులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ ఇచ్చిన అప్పులో రూ.2,810 కోట్లు (దాదాపు 86%) వీడియోకాన్‌ తిరిగి చెల్లించలేదు. 2017లో దీనిని మొండి బకాయిగా ప్రకటించారు.