ఐపీఎల్ పై పెరుగుతున్న వ్యతిరేకత... ఎందుకు..?

ఐపీఎల్ పై పెరుగుతున్న వ్యతిరేకత... ఎందుకు..?

రీ షెడ్యూల్ చేసిన టీ20 టోర్నమెంట్ తేదీలు దేశీయ పోటీలతో విభేదిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వదిలిపెట్టాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ పిలుపునిచ్చారు. కరోనావైరస్ క్రీడా ప్రపంచాన్ని స్తంభింప చేయడంతో, ఐపీఎల్ తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా పడింది. కానీ ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో టోర్నమెంట్ నిర్వహించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియాకు చెందిన షెఫీల్డ్ షీల్డ్ మరియు టీ 20 ప్రపంచ కప్‌తో రీ షెడ్యూల్ చేసిన ఐపీఎల్ ఘర్షణ పడుతుంటే, ఆసీస్ అంతర్జాతీయ ఆటగాళ్ళు వెనక్కి వెళ్లి దేశీయ పోటీలను ఆడాలని చాపెల్ అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బాగా చూసుకుంటుంది, కాబట్టి అక్కడ వారికి ఒక బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను అని చాపెల్ అన్నారు.

అయితే అంతక ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ కూడా  ఐపీఎల్ కోసం టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడితే మిగితా దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను ఐపీఎల్ టీ 20 లీగ్‌లో పాల్గొనకుండా నిరోధించాలని ఆయన సూచించారు. అయితే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయడానికి భారత క్రికెట్ బోర్డు ఒత్తిడి చేయదు అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ అన్నారు.  ప్రస్తుతం కరోనా కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అందువల్ల భారత పర్యటన షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగితే 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ లో మరో టెస్ట్  మ్యాచ్ భారత్ ను ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా అనుకుంది. అయితే ఈ విషయం పై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 5 టెస్టులు ఆడాలనే ఆలోచనను తోసిపుచ్చారు. అందువల్లే  సీఏ ఇప్పుడు బీసీసీఐ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత నిజం ఉంగది అనేది మాత్రం తెలియదు.