రాష్ట్రాల సమన్వయ లోపం : జగ్గయ్యపేట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

రాష్ట్రాల సమన్వయ లోపం : జగ్గయ్యపేట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

తెలంగాణ, ఏపీ సరిహద్దుల వద్ద పోలీసులు చెక్‌ పోస్టులను మూసివేసారు. దీంతో రెండు రాష్ట్రాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  హైదరాబాద్ నుంచి భారీగా వచ్చిన కార్లు, బైక్‌లను ఏపీలోకి అనుమతించకపోవటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడే పడిగాపులు గాస్తున్నారు. నిజానికి కరోనా వైరస్ ప్రబలుతున్నందున దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయిన నేపథ్యంలో హైదరాబాద్‌ హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులు ఒత్తిడి తీసుకురావడంతో అనేక మంది యువతీ యువకులు తెలంగాణా పోలీసుల నుండి ఎన్ఓసీలు తీసుకుని ఏపీలోని వివిధ ప్రాంతాలకి బయలుదేరి వెళ్ళారు. అయితే వారందరినీ ఇప్పుడు ఏపీ బోర్డర్ లో ఆపేశారు. ఇప్పుడు వారందరినీ క్వారంటైన్ చేయబోతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. బహుశా వీరందరినీ థర్మల్ టెస్ట్ లు చేసి వదులుతారో ? లేక వీరందరినీ అదుపులోకి తీసుకుని క్వారెంటైన్ కి తరలిస్తారో చూడాలి. రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ఉండడంతో తాము నలిగిపోతున్నామని అక్కడ చిక్కుకుని ఉన్నవారు కామెంట్ చేస్తున్నారు.