ప్లీజ్ వెళ్ళిపోతాం అనుమతించండి ... నగర ప్రజల ఆవేదన... 

ప్లీజ్ వెళ్ళిపోతాం అనుమతించండి ... నగర ప్రజల ఆవేదన... 

కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.  మొదట రాష్ట్రాలు మార్చి 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించాయి.  కానీ, మోడీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని 21 రోజులపాటు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు.  జనతా కర్ఫ్యూ తరువాత మార్చి 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది స్టూడెంట్స్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు.  అయితే, ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్ లో ఉండే వ్యక్తులు మాత్రం అక్కడే ఉండిపోయారు.  

అయితే, ఈరోజు నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ కావడంతో జాబ్ చేస్తూ హాస్టల్స్ లో ఉండే వాళ్ళను కూడా ఖాళీ చేయిస్తున్నారు.  దీంతో వాళ్లంతా రోడ్డుమీదకు వచ్చేశారు. తాము ఊరికి వెళ్లేందుకు అనుమతించాలని, హాస్టల్స్ ను ఖాళీ చేయించారని, ఇక్కడే ఉంటె కష్టం అవుతుందని వాపోతున్నారు.  కానీ, పోలీసులు వాళ్ళను వెళ్లేందుకు అనుమతించక పోవడంతో రోడ్డుమీదనే రాత్రిళ్ళు జాగారం చేస్తున్నారు.  వీరే కాదు, ఉపాధి కోసం నగరానికి వచ్చిన చాలామంది లాక్ డౌన్ కారణంగా ఇక్కడ ఉండలేక ఊర్లకు వెళ్ళిపోదామని అనుకునే వాళ్ళు కూడా వెళ్లలేక రోడ్డుమీదనే ఉండిపోతున్నారు.  ప్రభుత్వం అనుమతిస్తే సొంత ఊర్లకు వెళ్లిపోతామని చెప్తున్నారు.