గొప్ప మనసు చాటుకున్న పోలీసులు..ప్రశంసించిన హోం మంత్రి.!

గొప్ప మనసు చాటుకున్న పోలీసులు..ప్రశంసించిన హోం మంత్రి.!

మూడు రోజులుగా వర్షంలో  తడుస్తున్న ఒక వ్యక్తిని కాపాడిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ  ప్రశంసించారు. చాంద్రాయణ గుట్ట  పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా ఒక వ్యక్తి వర్షంలో తడుస్తూ అక్కడే పడిపోయాడు.  సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆయనను రక్షించారు. ఆ వ్యక్తి  తన వివరాలను ఏమీ చెప్పలేని పరిస్థితిలో  ఉన్నప్పటికీ చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ కు చెందిన  బి. మహేష్ అనే కానిస్టేబుల్, ఎం.డి సయీద్ అనే  హోం గార్డ్ లు ఆ వ్యక్తిని రక్షించేందుకు 108 వాహనానికి  సమాచారం ఇచ్చారు. లేవలేని స్థితిలో ఉన్న అతడిని 108 వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న అతను ఏ వివరాలు చెప్పనప్పటికీ తన పేరు శేఖర్ అని చెప్పగలిగాడని పోలీస్ సిబ్బంది తెలిపారు. భారీ స్థాయిలో వర్షం పడుతున్నప్పటికీ  పోలీస్ సిబ్బంది వెళ్లి ఆ వ్యక్తిని కాపాడినందుకు హోంశాఖ మంత్రి వారికి అభినందనలు తెలియజేశారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతలను కాపాడడం తో పాటు ఈ రకమైన సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు.