ఏపీ చేతికి జీవీకే పవర్‌ ప్లాంట్లు?

ఏపీ చేతికి జీవీకే పవర్‌ ప్లాంట్లు?

రుణ భారంతో సతమతమౌతున్న  జీవీకే గ్రూప్‌ తన కొత్త గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను ఏపీ ప్రభుత్వానికి అమ్మేయాలని చూస్తోంది. ఇప్పటికే ఒక విద్యుత్‌ ప్లాంట్‌ను రూ. 260 కోట్లకు ఏపీ కొనుగోలు చేసింది. పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీపీ) పూర్తవడంతో 217 మెగావాట్ల గ్యాస్‌ ఆధారిత జేగురుపాడు ప్లాంట్‌ను ఏపీ ప్రభుత్వం 2015లోనే తీసేసుకుంది. ఇపుడు జేగరుపాడు  రెండో ప్లాంట్‌తో పాటు గౌతమి పవర్‌ ప్లాంటును కూడా ఏపీ తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇద్దరి మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని జేవీకే ప్రమోటర్లు అంటున్నారు.

తొలి ప్లాంటుకు ఎలాంటి రుణాలు లేనందున డీల్‌ సజావుగా సాగింది. కాని జేగరుపాడు రెండో దశపై రూ. 450 కోట్లు, గౌతమిపై రూ. 1200 నుంచి 1300 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ రెండు విద్యుత్‌ ప్లాంట్ల వాస్తవ విలువ... రుణాలకంటే అధికంగా ఉన్నట్లు వ్యాల్యూయేషన్‌ నివేదికలు వచ్చాయి. 300 ఎకరాల్లో విస్తరించిన జేగురుపాడు రెండో దశ ప్లాంట్‌ విలువ రూ.500  కోట్లు దాకా ఉందని, గౌతమి ప్లాంట్‌ విలువ రూ. 2000 కోట్లని విలువ గట్టారు.

గ్యాస్‌ అందుబాటులో లేని కారణంగా రెండు ప్లాంట్లు మూతపడ్డాయి.   2012లో ప్రారంభమైన ఈ రెండు ప్లాంట్లు కేవలం మూడేళ్ళు మాత్రమే పనిచేశాయి. రుణాలు ఇచ్చిన బ్యాంకర్లతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రెండు లేదా మూడు నెలల్లో ఈ డీల్‌ ఒక కొలిక్కి రావొచ్చని జీవీకే ప్రమోటర్లు అంటున్నారు.