ధర్మపురిలో మద్యం వ్యాపారి కాల్చివేత

ధర్మపురిలో మద్యం వ్యాపారి కాల్చివేత

తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలో అర్ధరాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన మద్యం వ్యాపారి మృతి చెందాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం  హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన సత్యనారాయణ గౌడ్ కొన్నేళ్లపాటు ముంబైలో కల్లు వ్యాపారం నిర్వహించాడు.  

ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందిన నేరెళ్ల రాజు ఇంట్లో ఎల్లమ్మ పట్నాలు (అమ్మవారి గుడి ఎదుట వేసే భారీ ముగ్గులు) ఉండడంతో బుధవారం సత్యనారాయణ వారింటికి వెళ్లాడు. రాత్రి పది గంటలకు మద్యం కోసం మరో ముగ్గురితో కలిసి కారులో ధర్మపురికి బయలుదేరారు. అక్కడి మద్యం షాపు మూసివేసి ఉండడంతో కారును వెనక్కి తిప్పుతుండగా కారుకు అడ్డంగా ఓ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. దీంతో అతడిని అడ్డు తప్పుకోమంటూ సత్యనారాయణ గౌడ్ కిందికి దిగాడు. ఆ దుండగుడు వెంటనే అతడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో సత్యనారాయణ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ముంబైలో కల్లు వ్యాపారం చేసేప్పుడు ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు ప్రాణభయం ఉందని బుధవారం మధ్యాహ్నం సత్యనారాయణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడాను. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.