గ్రీన్‌కో చేతికి మేఘా పవర్‌ నెట్‌వర్క్‌?

గ్రీన్‌కో చేతికి మేఘా పవర్‌ నెట్‌వర్క్‌?

ఉత్తరప్రదేశ్‌లో మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) నెలకొల్పిన  పవర్‌ ట్రాన్సిమిషన్‌ ప్రాజెక్టును కొనుగోలు చేయాలని గ్రీన్‌కో గ్రూప్‌ భావిస్తోంది. యూపీలో 765 కేవీ హై కెపాసిటీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌లో 2011లో మేఘా ఇంజినీరింగ్‌ దక్కించుకుంది. మెయిన్‌పురి-హాపుర్‌, మెయిన్‌పూర్-గ్రేటర్‌ నొయిడా మధ్య ఉన్న ఈ లైన్‌ ద్వారా 13,220 మెగావాట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌మిట్‌ చేసే వీలుంది. ఈ ప్రాజెక్టును 35 ఏళ్ళ పాటు నిర్వహించే హక్కు మేఘాకు ఉంది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రాజెక్టు ప్రారంభమైంది.  ప్రాజెక్టు నెలకొల్పేందుకు రూ. 6000 కోట్లకుపైగానే ఖర్చయినట్లు మేఘా అంటోంది.  లండన్‌లో లిస్టయిన గ్రీన్‌కో గ్రూప్‌ ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు చర్చలు ప్రారంభించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే డీల్‌ విలువ ఎంతో తెలియడం లేదు.  గ్రీన్‌కోతో జరుగుతున్న చర్చలపై వ్యాఖ్యానించేందుకు మేఘా నిరాకరించింది. అలాగే గ్రీన్‌కో కూడా స్పందించడం లేదు.  పరిశ్రమ వర్గాలు మాత్రం రెండు కంపెనీల మధ్య చర్చలు తుది దశకు చేరాయని అంటున్నాయి.