రాజధాని మార్పుపై తెలకపల్లి రవి విశ్లేషణ

రాజధాని మార్పుపై తెలకపల్లి రవి విశ్లేషణ

తెలకపల్లి రవి

పాలానా వికేంద్రీకరణ చట్టం- మూడుచోట్ల ప్రభావం

ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సిఆర్‌డిఎ, పాలానా వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెల్పుతారన్నది అనుకుంటున్న విషయమే. బిజెపి కొత్త అద్యక్షుడు సోము వీర్రాజుకూడా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా కేంద్రం జోక్యం చేసుకోదు అన్నప్పుడే ఇది మరింత స్పష్టమైపోయింది. అయితే ఆయన చెప్పిన రోజు అర్థరాత్రి నిమ్మగడ్డ రమేష్‌ నియామక ఉత్తర్వులు రావడం, సాయింత్రానికి  రాజధాని బిల్లు ఆమోదం పొందడం చూస్తే  ఇదంతా ఒక అవగాహనతోనే జరిగినట్టు కనిపిస్తుంది. శాసనసభ రెండవ సారి ఆ బిల్లు ఆమోదించిన తర్వాత మండలిలో చర్చనే జరగని నేపథ్యంలో రాజ్యాంగ రీత్యా  గవర్నర్‌ నిర్ణయానికి ఎలాంటి ప్రతిబంధకాలు వుండవు. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే అన్నట్టు 200 అధికరణం కింద కేంద్రానికి పంపాలనీ, లేదా విభజనచట్టంలో ఒక రాజధాని అని వుందిగనక మూడు రాజధానులు చెల్లవని చేసే సాంకేతిక వాదనలు గాని నిలిచేవి కావు. కాకపోతే సున్నితమైన సంక్లిష్టమైన బిల్లులు గనక గవర్నర్‌ అమరావతి స్థానిక ప్రజలతో రైతు తదితరులతో చర్చలు అవసరాన్ని ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పి వుండొచ్చు. అందుకోసం వ్యవధితీసుకోవడానికి ఆయనకు అవకాశముంది. దాన్ని ఎంతమాత్రం ఉపయోగించుకోకుండా న్యాయ నిపుణులతో సంప్రదింపుల తతంగం ముగించి వెంటనే ఆమోదం వేశారంటే కేంద్రం కూడా తొందరగా ముగించాలనుకున్నదన్నమాట. గత జూన్‌లో అమరావతి రాజధాని సురక్షితం కాదంటూ సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడ‌డంతో మొదలైన రాజధాని చలనం గవర్నర్‌ సంతకంతో ముగిసింది. ఇప్పటి వరకూ కేంద్రం ఆపుతుందని అంగుళం కూడా కదలదని పీఎంవో జోక్యం చేసుకుందని కథలు చెప్పిన వారు ఇప్పుడు కోర్టులు ఆపుతాయని కొత్త కబుర్లు ఎత్తుకున్నారు. గతంలో హైకోర్టు తరలింపు నిలిపివేయాని చెప్పినప్పటికీ శాసనప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడు గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపాక ఆ బిల్లులు స్వభావం పై చర్చ చేయొచ్చునేమో గాని విధాన నిర్ణయంపై  కోర్టు తలదూర్చవు. ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్‌ కూల్చివేత సందర్భంలోనూ సుప్రీం కోర్టు చెప్పింది అదే.

                చంద్రబాబు వాస్తవిక దృక్పథంతో అమరావతి అభివృద్ధి చేసివుంటే ఈ మార్పునకు అవకాశం వుండేదికాదు. 29 గ్రామాలను చిన్నాభిన్నం చేసి మరో కేంద్రీకృత రాజధాని కట్టాలనుకోవడం దానికోసం వేల ఎకరాలు సేకరించి సింగపూర్‌ చేతిలో పెట్టడం ఆయన చేసినపొరబాట్లు. దేశంలో అయిదవ నగరం ప్రపంచంలో ప్రముఖ నగరం చేస్తానని ఆయన చెప్పిన మాటు  పునాది లేనివి. ఆధునిక భార‌త‌దేశంలో గాని ప్రపంచంలో గాని అలా కొత్తగాపెరిగిన మహానగరాలు చాలా అరుదు.సైబరాబాద్‌ గురించి చెప్పే చంద్రబాబు దాన్ని హైదరాబాద్‌ ఆధారంగా పెంపొందించిన సంగతి మర్చిపోయారు. విజయవాడనో గుంటూరునో ఆధారం చేసుకుని పాలనా కేంద్రం కడితే కథ మరోలా వుండేది. ఇప్పుడు జగన్‌ ఆ పని చేస్తే చిన్న నగరం కట్టాడనే ఆరోపణ వస్తుంది.పైగా చంద్రబాబు ఆశ్రితులకు పెద్దపీట వేసిన ఆ ప్రాజెక్టును ప్రదేశాన్ని పెట్టుబడిపెట్టి పెంచడం జగన్‌కు మింగుడు పడని విషయం. పారిశ్రామిక ద్రవ్య రాజధానిగా వున్న విశాఖ రేపు పట్టణం పెంపొందించడం సులభమని తన భావనగా వుంది. దానికి తోడు వైసీపీకి తనదైనరాజకీయ ఆర్థిక వ్యూహం కూడా వుంది. విశాఖలో కూడా ఈ ప్రభుత్వం మెగా రాజధాని నిర్మాణం వంటి పనులు పెట్టుకోదని బొత్స స్పష్టంగానే చెప్పారు. భోగాపురం భీమిలి అంటున్నారు గాని ఇప్పుడు కరోనా నేపథ్యం అంతకు ముందు నోట్ల రద్దు వల్ల రియల్‌ ఎస్టేట్‌ దెబ్బతిన్న రీత్యా అమరావతి తరహా భ్రమలు విశాఖలో పునరావృతం కాకపోవచ్చు.

             మూడు రాజ‌ధానులు అంటున్నా హైకోర్టు వున్నంత మాత్రాన కర్నూలు రాజధాని కాదు. కేరళ హైకోర్టు కోచ్చిలో, యుపి హైకోర్టు అలహాబాద్‌లో ఒరిస్సా హైకోర్టు  కటక్‌లో వుంటే వాటిని రాజధానులు అన‌డం లేదు. అయితే అక్కడ రాజధాని ఏర్పాటును ఎవరూ కాదనడం లేదు గాని సుప్రీం కోర్టు ఆమోదం రావడానికి సమయం పట్టొచ్చు. ఈలోగాట్రైబ్లునల్స్‌ ఏర్పాటు  జరగొచ్చు. ఏడాదిలో కొద్ది రోజులు శాసనసభ జరిగే అమరావతి కూడా శాసనరాజధానిగా పేరు మాత్రమే నిలుపుకొంటుంది. జగన్‌ పాలనా కేంద్రంగా విశాఖ వుండబోతుందని గ్రేహౌండ్స్‌ ఆవరణలో సిఎం  క్యాంపు కార్యాల‌యం వుంటుందని దాదాపు రూఢీగా చెబుతున్నారు. అక్కడి నుంచి మధురవాడ, తగరపు వలస,బోగాపురం భీమునిపట్నం  వరకూ వివిధచోట్ల శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.భోగాపురం విమానాశ్రయం కట్టి విశాఖలో నౌకాదళ విమానాశ్రయం వారికే అప్పగిస్తారట. 

ఇవన్నీ రాజధాని మార్పు ఫాలోఅప్‌ చర్యలుగా వుండొచ్చు. అమరావతిలో భూమిలో ఒకప్పటి సీడ్‌క్యాపిటల్‌లో 1600 ఎకరాలు అమ్మకానికి పెట్టానుకుంటున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  అమరావతి మెట్రోపాలిటన్‌ సిటీ అంటున్నా రాజధాని తరలిపోయాక అంత సన్నివేశం వుండదు.దాదాపు 40 వేల ఎకరాల మేరకు ప్రభుత్వం చేతిలో వున్న భూమినీ, అక్కడ  కట్టడాల‌కు ఉపయోగించుకుని ఒక హబ్‌గా పెంచే ప్రణాళిక అమలు చేయొచ్చు. అక్కడ చిన్నాభిన్నమైన జీవితాలనూ వ్యవసాయాన్ని పల్లెనూ ఏం చేయాన్నది ప్రశ్నగానే వుంటుంది. వెనక్కు తిరిగి తీసుకుంటామంటే ఇచ్చేస్తామని గతంలో అన్నారు .సిఆర్‌డిఎ రద్దు జరిగిన తర్వాత అక్కడ ప్రజల కదలిక ఎలా వుంటుందనే దానిపై ప్రభుత్వ స్పందన ఆధారపడివుంటుంది. ఏమైనా ఈ ఒడుదుడుకులలో స్థానిక రైతు ఇతరులు ప్రమేయంలేదు గనక వారికి పూర్తి న్యాయం చేయడం తక్షణ బాధ్యతగా తీసుకోవాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం అందుకు తగినట్టు స్పందించాలి.