జీ 7ః ట్రంప్‌ దాదాగిరి ఒప్పుకోం

జీ 7ః ట్రంప్‌ దాదాగిరి ఒప్పుకోం

ప్రధాన దేశాల మధ్య ఓ యుద్ధానికి వేదికగా మారనుంది జీ 7 శిఖరాగ్రసమావేశం. కెనాడలోని క్యబెక్‌లోని లా మల్‌బి పట్టణంలో ఇవాళ  ఈ సమావేశం ప్రారంభం కానుంది. జీ7 కూటమిలో అమెరికా, జపాన్‌, కెనెడా, బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌ సభ్య దేశాలు. ఇటీవలి కాలంలో తమ దేశాల వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం భారీ సుంకాలు విధించడంతో కూటమిలోని మెజారిటీ దేశాలు చాలా గుర్రుగా ఉన్నాయి. జపాన్‌ ఎటువైపు మొగ్గకున్నా... ఫ్రాన్స్‌, కెనాడా దేశాలు ఇప్పటికే ట్రంప్‌ విధానాలపై బహిరంగంగా ట్వీట్ చేశాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ చాలా ఘాటుగా ట్రంప్‌ విధానాలను విమర్శిస్తున్నారు. ట్రంప్‌ తన పద్ధతి మార్చకోక పోతే.. అమెరికాను కాదని.. మిగిలిన ఆరు దేశాలు ఓ సంయుక్త ప్రకటన చేయాలనే సూచన చేశారు. కెనాడా అధ్యక్షుడు జస్టిన్‌ కూడా ట్రంప్‌పై చాలా ఘాటుగా ట్వీట్‌ చేశాడు. అయితే అమెరికాతో యూరో దేశాల వాణిజ్యాన్ని ప్రస్తావిస్తూ... ఆ దేశాలు 15100 కోట్ల డాలర్ల మిగులు  ఉండటాన్ని ట్రంప్‌ ప్రస్తావిస్తున్నారు. ఇన్నాళ్ళు తమ దేశ సంపదను దోచుకున్నారని యూరో దేశాలపై ధ్వజమెత్తారు. కెనెడా ప్రభుత్వం తమ దేశరైతులకు ఘోర అన్యాయం చేసిందన్నారు ట్రంప్‌. ఈ మొత్తం కూటమిలో జపాన్‌ ఒకటే తటస్థంగా ఉండేలా కన్పిస్తోంది. మరోవైపు బ్రిటన్‌ మధ్యవర్తి పాత్ర పోషించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో యూరో దేశాలు కలిసి ప్రయాణం చేయాలని, ఘర్షణ వాతావరణం మంచిది కాదని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే అంటున్నారు. ఈ నేపథ్యంలో జీ7 దేశాల సంయుక్త ప్రకటన కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.