ఎమ్మెల్యే నుంచి సర్పంచ్‌ల దాకా పదవులు వారికేనా? రాజకీయమా? రాచరికమా?

ఎమ్మెల్యే నుంచి సర్పంచ్‌ల దాకా పదవులు వారికేనా? రాజకీయమా? రాచరికమా?

తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లా ఉమ్మడి రంగారెడ్డి. పార్టీ ఏదైనా సరే కుటుంబ సభ్యులు అందరూ ఉండాల్సిందే. అక్కడితో ఆగిపోరు. జిల్లాలో, నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ టిక్కెట్ దక్కించుకుంటారు. రాజకీయాలు మనకెందుకులే అనుకునే స్థాయి నుంచి రాజకీయాలే జీవిత పరమావధిగా కొందరు నాయకులు ముందుకు సాగుతున్నారు. అందుకు ఒకే కుటుంబం నుండి కనీసం ముగ్గురు లేదా నలుగురు వివిధ రాజకీయ పదవుల్లో కొనసాగడమే ఇందుకు ఉదాహరణ. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య కుటుంబాల్లో పదవుల పంట ఎప్పుడూ పండుతూ ఉంటుంది. వీరి కుటుంబాల్లో ఇద్దరు నుంచి నలుగురు చొప్పున ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో.. ఆయా కుటుంబాల్లో ప్రజాప్రతినిధులుగా కొనసాగే అవకాశం చిక్కింది. ప్రస్తుతం ఈ రాజకీయ కుటుంబాల అంశం ఇటు రంగారెడ్డి.. అటు వికారాబాద్‌ జిల్లాలో చర్చకు దారితీస్తోంది. 

రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబంలో మరొకరికి ప్రజాప్రతినిధిగా అవకాశం లభించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వరుసగా రెండుసార్లు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని దక్కించుకున్న ఆయన సతీమణి పట్నం సునీతారెడ్డి.. ఈసారి వికారాబాద్‌ జిల్లా కోటిపల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. హ్యాట్రిక్‌ ఛైర్‌పర్సన్‌గా వికారాబాద్ జెడ్పీ పగ్గాలు చేపట్టారు. ఎమ్మెల్సీగా కొనసాగిన మహేందర్‌రెడ్డి తమ్ముడు పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డిపై గెలుపొందారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్‌ మండలం జెడ్పీటీసీగా మహేందర్‌రెడ్డి సోదరుని కుమారుడు, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డి ఉన్నారు. భార్య జెడ్పీ చైర్మన్‌గా, అన్న కొడుకు జెడ్పీటీసీలుగా గెలుపొందగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా.. తాను ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనయుడు కాలె శ్రీకాంత్‌కుమార్‌ మొయినాబాద్ జెడ్పీటీసీగా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలోకి వచ్చే నవాబుపేట మండలం ఎంపీపీగా యాదయ్య రెండో కోడలు దుర్గాభవాని, స్వగ్రామం చించల్‌పేట నుంచి భార్య జయమ్మ సర్పంచ్‌గా ఉన్నారు.

షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తన కుమారుడు రవీందర్ యాదవ్‌ను కేశంపేట ఎంపీపీగా, కోడలును నియోజకవర్గంలోని ఓ గ్రామ సర్పంచిగా గెలుపించుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన తల్లి ప్రమోదీని రెడ్డిని వికారాబాద్ జెడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇక మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణా రెడ్డి కోడలు అనితా రెడ్డిని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గెలుపించుకున్నారు. మరో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి..  ఐఎస్ సద‌న్ కార్పొరేటర్ గా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యే బాబాయ్ మహేందర్ రెడ్డి మంగళపల్లి కో ఆపరేటివ్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుటుంబ రాజకీయాలు మూడు ఎన్నికలు, ఆరు విజయాలు అన్న విధంగా ఉన్నాయి. ఒకే కుటుంబానికి పదవులు దక్కడం పై అదే పార్టీలో ఉండే ఆశావహులు పార్టీ తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.