నేతలకు హాట్‌లైన్ సౌకర్యం కల్పిస్తున్న ఫేస్‌బుక్

నేతలకు హాట్‌లైన్ సౌకర్యం కల్పిస్తున్న ఫేస్‌బుక్

కోట్లాదిమంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి.. కేంబ్రడ్జి అనలిటికా అనే సంస్థకు అమ్మినట్లు ఆరోపణలు అందుకోవడం ఫేస్‌బుక్‌కు మాయని మచ్చగా మారింది. ఇలాంటి తప్పు ఇక నుంచి జరగదని.. ఇదే చివరిసారని.. క్షమించాలంటూ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచ ప్రజలను వేడుకున్నారు. అటు ఈ డేటా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు భారత్‌లోని కొన్ని ఎన్నికలను ప్రభావితం చేసేలా కేంబ్రిడ్జి అనలిటికా ఆరోపణలు ఎదుర్కొంది. నాటి నుంచి వినియోగదారుల ప్రైవేట్ డేటాకు రక్షణ కల్పించేందకు కఠిన చర్యలు తీసుకుంది ఫేస్‌బుక్.

ఈ నేపథ్యంలో భారత్‌లోని రాజకీయ నాయకులు, పార్టీల కోసం నిన్న కొత్తగా సైబర్ థ్రెట్స్ క్రైసిస్ ‌ఈ-మెయిల్ హాట్ లైన్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా భారత్‌లోని నేతలు, పార్టీలు ఉపయోగించే ఫేస్‌బుక్‌ పేజీలు, పర్సనల్‌ ఖాతాలను భారత ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్‌‌కు అనుసంధానిస్తారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు, నియమాలకు సంబంధించి సైబర్ సెక్యూరిటీ గైడ్‌ను విడుదల చేసింది. అలాగే ఈ రాజకీయ ఖాతాల భద్రతకు సంబంధించి కేంద్రప్రభుత్వం లెవనెత్తిన ప్రశ్నలకు మార్క్ జుకర్ బర్గ్ సమాధానాలను ఇచ్చారు. రాజకీయఖాతాలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తమ బృందం ఎల్లప్పూడు అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ విధానం ద్వారా రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించకుండా.. వారి ఖాతాలను హ్యాక్ చేయకుండా అడ్డుకోవచ్చని జుకర్‌బర్గ్ తెలిపారు.