కరోనా ఎఫెక్ట్ : కర్ర పుల్లలతో వోటింగ్ !

కరోనా ఎఫెక్ట్ : కర్ర పుల్లలతో వోటింగ్ !

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న ఏర్పాట్లు చేస్తోన్నట్టు తెలుస్తోంది. పోలింగ్‌​సమయంలో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టదిట్టమైన చర్యలు చేపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. 65 ఏళ్ల పైబడిన వాళ్లతో పాటు కోవిడ్‌ బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించిన ఈసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్క పుల్లలను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్, నవంబర్ మధ్య జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది ఎన్నికల సంఘం.

పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే వారికి ఖాదీ మాస్కులతో పాటు శానిటైజర్‌ కూడా ఎన్నికల సంఘం సరఫరా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఓటింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేందుకు అదనంగా 45 శాతం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించకపోవడంతో జాగ్రత్తలు పాటిస్తూనే యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.