తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతల్లో తగ్గిన జోష్‌

తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతల్లో తగ్గిన జోష్‌

ఆ ఎమ్మెల్యేకు వ్యాపారాలు దెబ్బతింటాయని భయం. మరో ఎమ్మెల్యే భర్తకు పగ్గాలు అప్పగించి సైలెంట్‌ అయిపోయారు. ఉద్దండులైన నాయకులు ఉన్నా.. కేడర్‌లో జోష్‌ లేదు. గెలిచిన ఏడాదిలోనే డీలా పడిపోయారు. భవిష్యత్‌ లేదని బెంగపెట్టుకున్నారో ఏమో కానీ.. చాలా మంది నాయకులు, కార్యకర్తలు జంప్‌ చేయడానికి ప్లాన్స్‌ వేసుకుంటున్నారట. 

వైసీపీ ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోని టీడీపీ నేతలు!

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి సీనియర్‌ నాయకుల అండ ఉన్నా..  తెలుగు తమ్ముళ్లల్లో మునుపటి జోష్‌  లేదు. ఏడాది అయినా  వైసీపీ ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంటే రాజకీయాలు వేడివేడిగా ఉండేవి. ఇప్పుడు నేతలు పట్టించుకోవడం లేదని.. కేడర్‌లోనూ ఆ ఉత్సాహం చచ్చిపోయిందని అంటున్నారు. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని సైలెంట్‌ అయ్యారా?

జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీలుగా యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, VVS చౌదరి ఉండగా.. ఎమ్మెల్యేలుగా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఏదైనా సంఘటన జరిగితే యనమల, చినరాజప్పలు మీడియా సమావేశాలు పెట్టడం తప్ప మిగతా వారు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదట. ఇటీవల వీరిద్దరూ ఓ వివాహానికి హాజరై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని ముందస్తు బెయిల్‌ పొందడానికి నానా హైరానా పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు నేతలూ హడావిడి తగ్గించారు. 

నాలుగు నెలలుగా ప్రజలకు కనిపించడం లేదా?

మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కరోనా ఎఫెక్టో ఏమో కానీ.. దూకుడు తగ్గించారు. పైగా ఆయన వయస్సు సహకరించడం లేదని అంటున్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ  పార్టీ పగ్గాలను, ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులను తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు అప్పగించేశారని టాక్‌. భవానీ ఏ కార్యక్రమాలకూ రావడం లేదు. నాలుగు నెలలుగా ఇక్కడ ప్రజలకు ముఖం చాటేశారని అనుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓటు వేసి చంద్రబాబు ఆగ్రహానికి కారణమయ్యారని సమాచారం. అచ్చెన్న అరెస్ట్‌ తర్వాత నారా లోకేష్‌ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లినప్పుడు సోదరుడు రామ్మోహన్‌నాయుడితోపాటు బాబయ్‌ ఇంట్లో కనిపించిన భవానీ మళ్లీ బయటకు రాలేదని అంటున్నారు. 

పిల్లితో పోరాడి ఇప్పుడు సైలెంట్‌ అయ్యారా?

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఊసు కూడా వినిపించడం లేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనలో ఉత్సాహం లేదట. పారిశ్రామిక వేత్త కావడం, ప్రతిపక్ష పార్టీలో ఉండటంతో సైలెంట్‌ అయ్యారని టాక్. మూడోసారి గెలిచిన కొత్తలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో కయ్యానికి కాలుదువ్వినా.. ఇప్పుడు ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదట. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతోపాటు.. మాజీ ఎమ్మెల్యేలంతా ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లు ఉన్నారని సమాచారం.

వైసీపీ ఎమ్మెల్యే చుట్టూ టీడీపీ కార్పొరేటర్ల ప్రదక్షిణ!

కోనసీమలోనూ నాయకులు టీడీపీని పట్టించుకోవడం లేదట. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 35 మంది కార్పొరేటర్లలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు తప్ప ఎవరూ మిగల్లేదట. దాదాపు 30 మంది TDP కార్పొరేటర్లు YCP జెండా కప్పుకోకుండానే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వెనుక తిరుగుతున్నారట.  ఈ విధంగా జిల్లాలో చాలా మంది టీడీపీ నేతలు సీఎం జగన్‌ ఓకే అంటే ఫ్యాన్‌ కిందకు చేరి ఊపిరి పీల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గాల్లో ఉన్న ఈక్వేషన్స్‌ తేడా కొడతాయనే కారణంతో వారికి గేట్లు తీయడం లేదని అంటున్నారు. మొత్తానికి ఉద్దండులైన నాయకులు ఉన్నా.. టీడీపీ జావగారిపోవడం ఆపార్టీలోనే చర్చకు దారితీస్తోంది.