లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా పెరుగుతున్న డయాబెటిస్ రోగులు 

లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా పెరుగుతున్న డయాబెటిస్ రోగులు 

మార్చి 25 నుంచి దేశంలో లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే.  రెండు నెలలపాటు ప్రజలు బయటకు రాకుండా ఉండిపోయారు.  అయితే, ఇటీవల కాలంలో ఒక్కొక్కటి అన్ లాక్ చేసుకుంటూ వస్తున్నారు.  ప్రజలు ఇంట్లోనే ఉండిపోవడంతో ప్రజలపై ఒత్తిడి పెరిగింది.  పైగా ఇంటి నుంచే పనిచేస్తుండటంతో చాలామంది జీవన శైలి కూడా మారిపోయింది.  కదలకుండా కూర్చొని పనిచేస్తున్న కారణంగా చాలామందిలో షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయని తాజా సర్వేలు చెప్తున్నాయి.  

దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిలో ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.  మాములు డయాబెటిస్ రోగుల్లో ఉండాల్సిన దానికంటే 20శాతం అధికంగా ఉన్నట్టు తాజా సర్వేలు చెప్తున్నాయి.  బీటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ  డయాబెటిస్ రోగులపై సర్వే నిర్వహించింది.  దేశవ్యాప్తంగా 8200 మందిపై ఈ సర్వేను నిర్వహించింది.  ఇందులో అనేక విషయాలు వెలుగుచూశాయి.  మార్చి నెల వరకు షుగర్ రీడింగ్ 135 ఎంజీ/ డిఎల్ ఉండగా, ఏప్రిల్ ఆఖరు నాటిది ఇది 165 ఎంజీ/ డిఎల్ కు చేరింది.  జీవన శైలిలో మార్పులే ఇందుకు కారణం అని అంటున్నారు.  ఒత్తిడి ఆందోళన వంటి వాటికి గురి కాకుండా మారిన జీవన శైలికి అనుగుణంగా ప్లాన్ చేసుకొని పనులు చక్కబెట్టుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.